పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి - ఉంగుటూరు
ఆక్వా రైతులకు జనసేన అండగా ఉంటుందని పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని నారాయణపురంలో బుధవారం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మనోహర్ పాల్గొన్నారు. ఉండి మండలం కుప్పనపూడికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త శ్రీమన్నారాయణ విద్యుదాఘాతంతో ఇటీవల మృతిచెందారు. ఈ క్రమంలో పార్టీ తరపున సభ్యత్వ బీమాగా రూ.ఐదు లక్షల విలువైన చెక్కును భార్య, కుమారులకు అందించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మనోహర్ మాట్లాడుతూ ఆక్వారైతుల కష్టాలు, సమస్యలపై పార్టీ అధ్యయనం చేస్తోందని పూర్తి సమాచారం రాగానే విధివిధానాలను వెల్లడించి లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ఆక్వారంగానికి అండగా ఉంటామని పవన్‌కల్యాణ్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. సంఖ్య ప్రధానం కాదని పరిపాలనలో నిజాయితీ ఉండాలని వైసిపిని విమర్శించారు. రాజోలులో రైతు భరోసా కేంద్రాల్లో బస్తాకు రూ.50 నుంచి రూ.వద వరకూ పన్ను కట్టాలంటూ రైతులను దోచుకోవడం దారుణమని విమర్శించారు. రైతులకు క్రాప్ హాలీడే కాదని, వైసిపికి హాలీడే ఇచ్చే రోజులు ముందున్నాయని విమర్శించారు. గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది 46 మంది రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలతో 1100 మంది మాత్రమేనంటూ తప్పుడులెక్కలు చెబుతోందన్నారు.
జనసేన నాయకులను పోలీసులు వేధించి, అక్రమ కేసులు పెడితే అండగా ఉంటామని, ప్రతీ పోలీస్ స్టేషన్‌కు ఒక లాయర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేనకు మంచి ఆదరణ ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని మనోహర్ పిలుపునిచ్చారు. పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వానించి జెండా కప్పారు. ఆక్వా రైతులతో ముచ్చటించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, మహిళలు, కార్యకర్తలతో మాట్లాడారు. తొలుత ఉంగుటూరు టోల్‌గేటు వద్ద మనోహర్‌కు ఘనస్వాగతం పలికారు.










