Nov 22,2022 23:10

  • కొనుగోలులో దళారులదే హవా
  • ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలుకాని వైనం
  • నేరుగా రైతుల నుంచి కొనుగోలుకు కంపెనీల నిరాకరణ
  • కిలోకు రూ. 30 నుంచి రూ. 40 వరకు ధర తగ్గింపు

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి
కోడూరు మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన కొల్లి చినబాబుకు చెందిన ఏడెకరాల్లో రెండు రోజుల క్రితం రొయ్యలు పట్టుబడి జరిగింది. 10 టన్నుల మేర దిగుబడి వచ్చింది. 25 కౌంట్‌ రొయ్యలకు కిలోకు గతంలో రూ.550 వరకు ధర వచ్చేది. ఇప్పడు ప్రభుత్వం రూ.420గా ధర నిర్ణయించింది. రొయ్యల కంపెనీలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. అయితే కంపెనీలు నేరుగా రైతుల నుంచి కొనేందుకు నిరాకరించాయి. మధ్య దళారులు రంగ ప్రవేశం చేసి రూ.370కు కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా కిలోకు రూ.50 తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. టన్నుకు రూ.50 వేల చొప్పున మొత్తం 10 టన్నులకు రూ.5 లక్షలు నష్టపోయారు. పిట్టల్లంక గ్రామం సంగా వెంకటకృష్ణారావుకు చెందిన ఎకరంన్నర విస్తీర్ణంలోని చెరువులో రెండు టన్నులు దిగుబడి వచ్చింది. 100 కౌంట్‌ రొయ్యలను రూ.220కు కొనాలి. కానీ రూ.180లకు మాత్రమే అమ్ముకోగలిగారు. కిలోకు రూ. 40 తక్కువకు కొన్నారు. టన్నుకు రూ.40 వేల చొప్పున రెండు టన్నులకు రూ.80 వేలు నష్టపోయారు. ఈ ఇద్దరి రైతులే పరిస్థితేకాదు...రొయ్యలు సాగు చేసిన రైతులందరి పరిస్థితి ఇలాగే ఉంది.
మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, నందివాడ తదితర మండలాల్లోని 33 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. ఏటా సగటున 75 వేల టన్నులు దిగుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందాన మారిపోయింది. ఈ సీజన్లో రొయ్య పిల్ల, మేత, విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎకరా రొయ్యల పెంపకానికి రూ.3.50 లక్షలకుపైగా ఖర్చవుతోందని ఆక్వా సాగుదారులు చెబుతున్నారు. ఈపరిస్థితుల్లోనే అమెరికా, యూరప్‌ దేశాలకు రొయ్యల ఎగుమతులు తగ్గిపోయాయని చెబుతూ వాటి ధరలను కంపెనీలు తగ్గించి వేశాయి. దీంతో రైతులు నష్టపోకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర నిర్ణయించింది. 20 కౌంట్‌ రొయ్యలు కిలోకు 450 రూపాయలు, 25 కౌంట్‌కు 420 రూపాయలు, 30 కౌంట్‌కు 380 రూపాయలు, 40 కౌంట్‌ 340 రూపాయలు, 45 కౌంట్‌కు 300 రూపాయలు, 50 కౌంట్‌కు 290 రూపాయలు, 60 కౌంట్‌కు 270 రూపాయలు, 70 కౌంట్‌కు 250 రూపాయలు, 80 కౌట్‌కు 240 రూపాయలు, 90 కౌంట్‌కు 220 రూపాయలు, 100 కౌంట్‌కు రూ. 210గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అయితే కంపెనీలు నేరుగా రైతుల నుంచి కొనేందుకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కూడా రైతులకు దక్కడం లేదు. దళారులు కిలోకు రూ.50 నుంచి రూ.40లకు ధర తగ్గించి కొంటున్నారు. దీంతో వారు మరింతగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు నేరుగా తమ నుంచి రొయ్యలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.