Apr 30,2023 21:54

ప్రజాశక్తి - ముదినేపల్లి
         వైవాక గ్రామంలో అనుమతులు లేకుండా తాగునీటి చెరువు సమీపంలో చేపట్టిన ఆక్వా చెరువు తవ్వకం పనులు ఆపాలంటూ గ్రామ దళితులు కోరుతున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా ప్రజలకు తాగునీటిని అందించే చెరువు కలుషితమవుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆదివారం విలేకరులకు సమస్యను వివరించారు. వైవాక తాగునీటి చెరువులోకి పంటబోదె ద్వారా నీటిని నింపుతారన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన అడుసుమిల్లి సుబ్బారావు ఆసామి, అతని కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువు తవ్వుతున్నారన్నారు. ఆక్వా చెరువు తవ్వకం వల్ల గ్రామ తాగునీటి చెరువుకు వచ్చే పంట బోదె కలుషితమై తాగునీటి వనరు పాడైపోతుందన్నారు. ప్రస్తుతం చేపల చెరువుగా తవ్విన తర్వాత రొయ్యల చెరువుగా మార్చి ఉప్పుకట్టలు, పలు రకాల రసాయనాలు తెచ్చి చేపల చెరువు నీటిలో కలపుతారని, దీనివల్ల ఆక్వా చెరువు మరింత విషతుల్యమవుతాయని తెలిపారు. చెరువులోని ఊట పంటబొదెలోకి దిగడంతో ఆ నీరు పశువులు, గొర్రెలు, మేకలు తాగి పారుడు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. అంతేకాక చేపల చెరువు ఊట పంట బొదెలోకి చేరి సాగునీరు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై తహశీల్దార్‌కు, కలెక్టర్‌కు స్పందనలో ఆర్జీలు సమర్పించామన్నారు. అయినప్పటికీ అధికారులు నేటికీ ఏలాంటి చర్యలూ తీసుకోలేదని వాపోయారు. అధికార పార్టీ నేతలు చెరువు తవ్వే వ్యక్తి వెనుక ఉండి తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్‌ స్పందించి ఆక్వా చెరువు తవ్వకందారునిపై చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామంలోని తాగునీటి చెరువు కలుషితం కాకుండా కాపాడాలని వైవాక గ్రామస్తులు యాకోబు, ముత్యాల బాబూరావు, బి.రాంబాబు, గ్రామస్తులు కోరుతున్నారు.