Mar 13,2022 13:19

పుడమితల్లి తనువుపై
పురుడోసుకున్న మాను..
మహా వృక్షమై ఎదురుచూస్తుంది
నలుగురు మనుషులకు నీడనిస్తానని
తన కౌగిలిలో బంధించుకొని..
ఆకుపచ్చని అమ్మతనాన్ని పంచుతానని

భూమాత గుండెలో వేర్లయి విస్తరించి..
కొమ్మలకు కమ్మనైన ఫలాలను
పూయించుకొని..
కనురెప్ప వాల్చకుండా చూస్తుంది
తరువుల తల్లి..
కడుపున కాలుతున్న ఆకలి తీరుస్తానని
బతుకును...ఆశల రెక్కల్లో దాచుకొని..
నింగిని ముద్దాడి వస్తున్న పక్షి పిల్లలను
తన ఒడిలో
నిద్దురపుచ్చుతానని జోలపాట పాడుతూ..
ఎదురుచూస్తుంది పుడమి కానుపు

ఇంటిముంగిట విరబూసిన
ఎర్రని గులాబీలు నల్లని కురులను ముద్దాడి
మగువల సిగలో ఒదిగిపోవాలని
సుతారంగా చూస్తున్నవి
ప్రేమబంధాల్లా అల్లుకున్న మల్లెతీగలకు
పూసిన మల్లెపువ్వులు..
నువ్వు పూజిస్తున్న లయకరుడి
పాదాలకాడ చేరి..
నీకు వరములియ్యమని మొక్కుతున్నయి

బంతిపువ్వులన్ని దండలై అల్లుకొని..
కలాన్ని కదిలిస్తూ..
కవితల గూడును నిర్మిస్తు..
అవినీతి మరకలంటి
కంపుకొడుతున్న సమాజాన్ని
తన అక్షరాలన్నింటిని ఒక్కదగ్గరికి చేర్చి..
కవితల తుపాను సృష్టించి..
ప్రశ్నల వర్షం కురిపిస్తూ..
సమాధానాలు రాబడుతూ..
అవినీతి కుళ్లునంత కడిగేస్తున్న
కవి హృదయుడి మెడలో హారాలై
ఉండిపోవాలని పరితపిస్తున్నాయి

నువ్వెప్పుడైన విటపములా ఆలోచించావా?
నింగిలో మొలిచిన నక్షత్రాలను తెంపి..
నలుగురి మనుషుల హృదయాల్లో నింపి..
వెలుగు పువ్వులను వెదజల్లాలని
నువ్వెప్పుడైన పుష్పదములా పరితపించావా?
శ్వేతదామములా కరుగుతున్న జీవితాన్ని
వెలిగించి నలుగురికి
వెలుగుదారిని చూపాలని?
నువ్వెప్పుడైనా మనసనే మానుకు
మానవత్వం అనే మొగ్గల్ని మొలిపించావా?
కాస్త ఆలోచించు నేస్తం.!

అశోక్‌ గోనె
94413 17361