May 22,2022 12:05

కావాల్సిన ఆకృతుల్లో కొలువుదీరి, కనువిందు చేసే తీగ జాతి మొక్కలు మాల్ఫీజియా కీపర్లు. చిన్ని చిన్ని ఆకులతో చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఈ అందమైన మొక్కలు నిండుగా ఆకుపచ్చని పత్రహరితంతో ఎంతో అబ్బురపరుస్తుంది. ఇది మాల్ఫీజియేసియా కుటుంబానికి చెందిన పుష్పించే జాతి మొక్క. ఉష్ణ, ఉపఉష్ణ మండలాల్లో ఇవి బాగా పెరుగుతాయి. కరేబియన్‌ దీవులు వీటి పుట్టుక. సింగపూర్‌ హోలీ, డ్వార్పూ హోలీ అని కూడా పిలుస్తారు. మొక్క జూన్‌ మొదటివారం నుంచి మార్చి వరకూ పూసే తెల్లటి చిన్న చిన్న పూలు మనోహరంగా ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా సరే తట్టుకొని, మనం అందించే కొద్దిపాటి నీటికి ఆకుపచ్చగా హృదయాలకు అల్లుకుపోతుంది. కరేబియా నుంచి ఈశాన్య అమెరికా, అర్జెంటీనా తదితర ప్రాంతాల వరకూ అటు నుంచి ప్రపంచమంతా ఎగబాకింది ఈ వయ్యారి వనం. ఇందులో దాదాపు 75 రకాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

మాల్ఫీజియా గ్లాబ్రా..

మాల్ఫీజియా గ్లాబ్రా..
'కొక్కిజీరా' దీని శాస్త్రీయ నామం. ఇందులోనే 'మాల్ఫీజియా గ్లాబ్రా' అనే మరో రకం మొక్క కూడా. అది పింక్‌ రంగు పూలు పూస్తుంది. ఏడాదికోమారు ఎర్రటి కాయలు కాస్తుంది. ఆ కాయలు చాలా పుల్లగా ఉంటాయి. విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. విదేశాల్లో వీటి నుంచి జ్యూస్‌ తీసుకుని, తాగుతారు. మన దేశంలో వీటి వాడకం తక్కువ.
 

akurathi

అలరించే ఆకృతులు..
మాల్ఫీజియా కీపర్‌ మొక్క చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఎలా మలిస్తే.. ఆ ఆకారంలో చక్కగా ఇమిడిపోతుంది. అలా పొందిగ్గా ఎదుగుతుంది. వెల్కమ్‌ బోర్డులు, గోళాలు, బంతులు కోనులు, పిరమిడ్లు, స్తూపాలు, ఆర్చీలు, నక్షత్రాలు విమానాలు వంటి ఎన్నెన్నో ఆకారాలతో బాటు పులులు, సింహాలు, ఏనుగులు, దుప్పిలు, గుర్రాలు వంటి జంతువులు.. నెమళ్లు, పావురాలు, రాబందులు లాంటి పక్షులు.. చేపలు, మొసళ్ళు డైనోసార్లు, డాల్ఫిన్లు, తాబేళ్లు లాంటి జలచరాలు.. వనిత హొయలు, వీర సైన్య పరాక్రమం, బార్బీ బొమ్మలు వంటి ఎన్నో చిత్రవిచిత్ర కళాఖండాలు ఈ మొక్కలతో మలచడం సాధ్యమవుతాయి. చక్కటి నైపుణ్యాన్ని మేళవించి, సజనాత్మకత జోడిస్తే, కావలసిన రూపంలో ఈ మొక్కలను మలుచుకోవచ్చు. ఇంటి ముంగిట, కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు, కార్పొరేట్‌ ఆఫీసుల్లో, పార్కులు, మాల్స్‌ ముందర మాల్ఫీజియా కీపర్‌ మొక్కలు ఆకుపచ్చని విరి సిరితో నయనానంద పరుస్తాయి.
 

utapathi

ఉత్పత్తి..
మాల్ఫీజియా కీపర్‌ మొక్కలను కత్తిరించి, వాటి తెగ భాగాలను మట్టిలో గుచ్చి, కొత్త మొక్కలు తయారుచేస్తారు. కత్తిరించిన మొక్కలను జాగ్రత్తగా ఒకరోజు రూటింగ్‌ ద్రావణంలో నానబెట్టి, మర్నాడు మట్టి ప్యాకెట్లలో గుచ్చుతారు. అవి వారం రోజులకు వేర్లు పోసుకుని, కొత్త మొక్కలుగా తయారవుతాయి.
 

dhara

ధర చౌకే..
మాల్ఫీజియా కీపర్‌ మొక్క ధర చాలా చౌకే. ప్లాస్టిక్‌ ప్యాకెట్లలో పెట్టి ఈ మొక్కలు అమ్ముతారు. ఒక్కో మొక్క ఆరు నుంచి పది రూపాయల వరకు ఉంటుంది. కావలసిన ఆకారము పరిమాణాన్నిబట్టి కుండీల్లో నాటుకునే మొక్కల సంఖ్య ఉంటుంది. కుండీల్లో ఆకారాలు తయారుచేసిన రెడీమేడ్‌ మొక్కలు కూడా ఉంటాయి ఈ మొక్క ఒక్కొక్కటి వెయ్యి నుంచి పదివేల వరకు ధర పలుకుతుంది. కడియం నర్సరీల్లో ఇలాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
 

bonsai

బోన్సారు మొక్కలుగా..
బోన్సారు మొక్కలుగా మలిచేందుకు అత్యంత అనువైన మొక్కలు మాల్ఫీజియా కీపర్‌. చాలా తొందరగా పెరిగి, భలే అందంగా విచ్చు కోవడంతో ప్రపంచమంతటా సాగు చేసి, వీటిని బోన్సారు మొక్కలు తయారు చేస్తున్నారు.

samrashana


సంరక్షణ..
ఈ మొక్కలు పెంచాలంటే కాస్త కళాపిపాసులై ఉండాలి. మాల్ఫీజియా కీపర్‌ చాలా సులువుగా, వేగంగా పెరుగుతుంది. కావలసినప్పుడల్లా కొద్దిగా నీటిని ఇస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా ఎండలో పెరిగే మొక్క. కనీసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా ఈ మొక్క తీగలను కత్తిరించుకోవాలి. ఎలాంటి నేలలో అయినా చక్కగా పెరుగుతుంది. కాస్త సేంద్రియ ఎరువు వేస్తే చాలు. ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు, వేపనూనె పిచికారీ చేయాలి. మొదళ్లలో నీళ్లు ఎక్కువ నిల్వ లేకుండా చూసుకోవాలి. మొక్క మొదట్లో వచ్చే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.

chaluvapandari


చలువ పందిళ్లు..
మాల్ఫిజియన్‌ క్రీపర్‌ తీగ మొక్కలను ఇటీవల కాలంలో చలువ పందిళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంటి ముంగిట పందిరిలాగా, ఇళ్ళ మీదకు ఎగబాకి ఎండ నుంచి ఉపశమనం కలిగించే పైకప్పు లాగా, రచ్చబండలు, బెంచీలకు టోపీల్లా, ఇంటికి స్వాగత తోరణాల్లాగా ఈ క్రీపర్‌ మొక్కను విరివిగా ఉపయోగిస్తున్నారు.
పెంచే విధానం..
ముందుగా మొక్కల్ని నేల మీద కానీ, కుండీల్లో కానీ నాటాలి. కావలసిన ఆకారాన్ని ఇనుము లేదా అల్యూమినియం తీగలతో చట్రాలు చేసుకుని మొక్కలపై ఉంచాలి. పెరుగుతున్న మొక్కలను నుంచి వచ్చే తీగలను నెమ్మదిగా చట్రాల మీదకు మళ్ళించాలి. మూడు లేదా నాలుగు నెలల్లో మొక్క తీగలు చట్రం అంతా పెనవేసుకుపోతాయి. క్రమక్రమంగా ఆకారం రూపు తేలుతుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి కత్తెరితో ట్రిమ్మింగ్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న తీగలు మొక్కను పొదలా మార్చేస్తాయి. జులై నుంచి మార్చి చివరవరకు చిన్ని చిన్ని పువ్వులు పూస్తూ, రాలిపోతూ ఉంటాయి. పువ్వులో మకరందాన్ని సేవించడానికి అనేకరకాల కీటకాలు వచ్చి వాలుతూ ఉంటాయి. గ్రీష్మరుతువు రాగానే మొక్క కాస్త ఆకులు రాలుస్తుంది. వసంతంలో ఆకులు చిగురిస్తుంది.