Mar 24,2023 00:08

నాటికను ప్రదర్శిస్తున్న కళాకారులు

ప్రజాశక్తి-అనకాపల్లి
స్థానిక వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో ఈనెల 20 నుంచి 22 వరకు జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ఘనంగా ముగిశాయి. మూడవరోజు కొత్త పరిమళం, పక్కింటి మొగుడు నాటికలను ప్రదర్శించారు. ఈ మూడు రోజుల పోటీల్లో ఉత్తమ ప్రథమ ప్రదర్శనగా బోరువంక సర్వాణి గ్రామీణ గిరిజన సంఘం ప్రదర్శించిన 'కొత్త పరిమళం', ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గుంటూరు అమృత లహరి ఆర్ట్స్‌ థియేటర్‌ వారి 'నాన్న నేనొచ్చేస్తా, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశాఖపట్నం నటరాజ్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ వారి 'లాస్ట్‌ జడ్జిమెంట్‌' నాటికలు నిలిచాయి. ఉత్తమ జ్యూరీ అవార్డును కొప్పోలు పండు క్రియేషన్స్‌ వారి 'పక్కంటి మొగుడు' దక్కించుకుంది. ఉత్తమ నటుడు అవార్డు స్వర్ణకమలం నాటికలోని శ్రీహర్ష పాత్రధారి శ్రావణ్‌ ప్రసాద్‌, ఉత్తమ నటి నాన్న నేనొచ్చేస్తాలో సావిత్రి పాత్రధారి అమృత వర్షిని, ఉత్తమ హాస్యనటుడు బరిబత్తుల రాజు నాటికలో మనీష్‌, ఉత్తమ సహాయ నటుడు ఇదే నాటికలో తాళాబత్తుల వెంకటేశ్వరరావు, ఉత్తమ దర్శకుడు కొత్త పరిమళం నాటిక దర్శకులు బిఏఎస్‌ పట్నాయక్‌, ఉత్తమ సంగీత దర్శకులు ది లాస్ట్‌ జడ్జిమెంట్‌ నాటిక సంగీత దర్శకులు పి.లీల మోహన్‌, ఉత్తమ ఆహార్యం కేటగిరీలో నాన్న నేనొచ్చేస్తా నటి ఎం.అమృత వర్షిని, ఉత్తమ నాటక రచయిత కేటగిరీలో కొత్త పరిమళం రచయిత బిఎంఎస్‌ పట్నాయక్‌ అవార్డులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా దండు నాగేశ్వరరావు, బొబ్బన ధవలేశ్వరరావు, కె.శేషగిరిరావు వ్యవహరించారు. బహుమతులను కర్రి దివాకర్‌ అందజేశారు. నిర్వాహకులు పిసిహెచ్‌ నాయుడును డైమండ్‌ హిట్స్‌ తరఫున దాడి రత్నాకర్‌, ప్రముఖ రంగస్థలం నటుడు పిళ్ల సన్యాసిరావును మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ విష్ణుమూర్తి, గవర కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శిలపరశెట్టి బాబి, కె యం నాయుడు, భీశెట్టి కష్ణ అప్పారావు, సూరిశెట్టి రమణ అప్పారావు, విల్లూరి రాము, చదరం నారాయణరావు, సూరిశెట్టి రాము పాల్గొన్నారు.