
ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లి జార్జి క్లబ్ వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ ఆది లీల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటిక పోటీల్లో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం బోరివంక శార్వాణి గిరిజన సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో 'నిర్జీవ నినాదం' నాటిక, విశాఖపట్నం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో 'నిశ్శబ్దమా నీ ఖరీదెంత'? నాటికలను ప్రదర్శించారు. వీటి కథాంశాలను పరిశీలిస్తే వ్యవస్థల దౌర్జన్యం, దాష్టీకం, దమనకాండ భరించలేని స్థాయికి యువత చేరుకొని నిరసన తెలియజేయడానికి తమతమ గళాలను శక్తివంతమైన ఆయుధంగా మార్చడానికి వాడుకునే నినాదమే ''విప్లవం వర్ధిల్లాలి''. ఈ నినాదాన్ని నమ్ముకుని, వ్యవస్థల్లో మార్పు కోసం, సమసమాజ నిర్మాణం కోసం ఉద్యమాల దారులెన్నుకుని, సంఘ శ్రేయస్సు కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి త్యాగం చేసే విప్లవకారుల జీవితాలతో ముడిపడిన కథాంశమే 'నిర్జీవ నినాదం'. కుటుంబ సభ్యుల సామాజిక, శారీరక, మానసిక వ్యథలను నాణానికి మరో వైపు చూపించే ప్రయత్నం చేశారు. నిశ్శబ్దమా నీ ఖరీదెంత? నాటిక అక్రమ సంబంధం నేరం కాదని, ఉన్నత న్యాయస్థానం ఐపిసి నుండి 497 సెక్షన్ తొలగించింది. ఈ కారణంగా విడాకులు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించింది. మరి నైతిక విలువల మాటేమిటి? వివాహ వ్యవస్థ మాటేమిటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? ప్రశ్నించుకుంటే జవాబు శూన్యం. చట్టమే ఆ స్వేచ్ఛనిస్తే ఇక వీటిని ఆపేదెవరు? దీన్ని ఎవరూ ప్రశ్నించరే అనే ప్రశ్న నుండి రాయబడిన నాటికే 'నిశ్శబ్దమా నీ ఖరీదెంత'? ఈ రెండు నాటికలు ఆహూతులను సమాజం పట్ల ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. నిర్వాహకులను ప్రేక్షకులు అభినందిస్తూ ఇటువంటి ప్రదర్శనలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.