ప్రజాశక్తి -మధురవాడ : ప్రపంచ వారసత్వ సాంస్కృతిక నృత్యంగా యునెస్కో గుర్తింపు పొందిన ప్రసిద్ధ బెంగాలీ కళాకారుల పురూలియా చాహు నృత్య ప్రదర్శన అలరించింది. గీతం హెరిటేజ్ క్లబ్, స్పిక్‌మేకే సంస్థ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో బెంగాలీ కళాకారుల బృందం తమాల్ కాంతి రజాక్ నేతృత్వంలో సంప్రదాయ వేషధారణ, సంగీతంతో పురూలియా చాహు నృత్యాన్ని ప్రదర్శించింది. దుర్గాదేవి వేషధారణతో పాటు శివుడు, రాక్షసులు, అడవి మృగాలను వేదికపై ఆవిష్కరిస్తూ చేసిన నృత్యం ఆహుతులను మైమరపింపజేసింది. కార్యక్రమాన్ని ప్రియదర్శిని ఘోష్ ప్రారంభించగా, గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్, గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్ డైరక్టర్ ప్రొఫెసర్ బి.నళిని, గీతం స్పిక్‌మేకే కో-ఆర్డినేటర్ డాక్టర్ అముక్తమాల్యద తదితరులు పాల్గొన్నారు.










