ప్రజాశక్తి - బాపట్ల
పాఠశాల స్థాయి విద్యార్థినీ విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు అక్టోబర్ నెలలో 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు డిఇఒ పివిజే రామారావు తెలిపారు. డీఈఓ కార్యాలయంలో బాలల 31జాతీయ సైన్స్ కాంగ్రెస్ 2023 గోడ ప్రతులను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, ప్రచార పర్వంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి అప్ కాస్ట్, రాష్ట్ర పర్యావరణ అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచారమండలి ఈ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నాయని అన్నారు. బాల్యదశ నుండి విద్యార్థులు సృజనాత్మకతను ప్రదర్శించాలని అన్నారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని అన్నారు. సామర్ధ్యం పెంచుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక వేదికగా ఏర్పడిందన్నారు. బాల బాలికల్లో క్షేత్రస్థాయి పరిశీలన, సమాచార సేకరణ, సర్వే పద్ధతులు, విశ్లేషణ సామర్థ్యాన్ని ప్రోత్సహించాలని అన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి బాలలు ఆచరణాత్మక పరిశోధనలు చేపట్టేవిధంగా ఈ సైన్స్ కాంగ్రెస్ ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు నూతన అంశాలను తెలుసుకొనేందుకు ఆసక్తితో ఉన్నారని అన్నారు. ఉపాధ్యాయులు శ్రద్ధతో వారిలో నూతన దృగ్విషయాలను, శాస్త్రీయాంశాలను రగిలిస్తే భావి శాస్త్రవేత్తలుగా రూపొందుతారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర అంశాల పట్ల ఉత్సుకతతో ఉన్నారన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే తరగతి గదిలో చిన్న చిన్న ప్రయోగాలు నేర్పడం ద్వారా మేథో సంపత్తి పెరుగుతుందని అన్నారు. పాఠశాల నుంచే శాస్త్రవేత్తలుగా అభివృద్ది చేయవచ్చన్నారు. అన్ని పాఠశాలల్లలో సైన్స్ ల్యాబ్ లను విధిగా ఏర్పాటు చేయాలని అన్నారు. సైన్స్ ఉపా ధ్యాయులతో పాటు ఇతర సబ్జెక్టు టీచర్లు వీటి నిర్వహణలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సాదిక్ మహమ్మద్, సైన్స్ కాంగ్రెస్ బాపట్ల జిల్లా సమన్వయకర్త పి భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.
31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2023 ప్రధాన అంశాలు :
ఆరోగ్యం, సంక్షేమం కోసం, పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం పోషణ, సామాజిక సంస్కృతిక పద్ధతులు, స్వీయ విశ్వాసం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని అవలంబించడం వంటి అంశాలపై విద్యార్థులు ప్రధానంగా కేంద్రీకరించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తారన్నారు.










