Aug 27,2023 22:42

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌. నారాయణమూర్తి

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అక్టోబరు ఆరవ తేదీన 'యూనివర్శిటీ' సినిమాను విడుదల చేయనున్నట్టు సినీ నిర్మాత, దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి తెలిపారు. అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతోపాటు కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత బండి నారాయణస్వామి, ప్రముఖ రచయిత శాంతినారాయణ, విశాలాంధ్ర బుకహేౌస్‌ ఇంఛార్జీ ఈశ్వరరెడ్డి, మానవతా రక్తదాతల సంస్థ నిర్వాహకులు తరిమెల అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ విద్యా,వైద్యం రెండూ సేవారంగాలని చెప్పారు. అయితే ఈ రెండింటినీ వ్యాపారమయంగా మార్చేసారని విచారం వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యా రంగం వ్యాపారాత్మకంగా మారిందన్నారు. పుట్టగొడుగుల్లా ప్రయివేటు సంస్థలు పుట్టుకొస్తున్నాయన్నారు. వీటి మధ్య పోటీ కారణంగా అనేక పెడధోరణలు నెలకొంటున్నాయన్నారు. ఈ ఇతివృత్తంతోనే పరీక్షా పేపర్ల లీక్‌ ఆధారంగా 'యూనివర్శిటీ' సినిమాను రూపొందించినట్టు తెలిపారు. దీనికి ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత బండి నారాయణస్వామి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రయివేటీకరణ కారణంగా అనేక పెడధోరణలు నెలకొంటున్నాయన్నారు. విపరీతమైన పోటీల కారణంగా సంస్థలు అనేక అనైతిక మార్గాలను అనుసరిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా సినిమాలను రూపొందించడంలో నారాయణమూర్తి ముందుంటారని అన్నారు. ఆయన తీసిన యూనివర్శిటీ సినిమాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ రచయిత శాంతి నారాయణ మాట్లాడుతూ నేడు విద్య వ్యాపారమయంగా మారిందన్నారు. ఈ ప్రయివేటు పోటీలో ఫలితాల వెంట అందరూ పరుగులు తీయాల్సి వస్తోందన్నారు. ముందున్నామని చెప్పుకునేందుకు ఈ ప్రయివేటు సంస్థలు అనేక రకాలైన వక్రమాలను అనుసరిస్తున్నాయాన్నరు. తద్వారా కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. దీని ఆధారంగా రూపొందించిన ఆర్‌.నారాయణమూర్తి సినిమాను ఆదరించాలని కోరారు.