* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్టోబరు 2 నుంచి నవంబరు 8వ తేదీ వరకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదంచెల్లో యువతీ యువకులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నామన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ విభాగాల్లో గ్రామ సచివాలయ స్థాయి నుంచి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయిలో విజేతలకు స్పోర్ట్స్ కిట్‌లను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 30 మండలాల్లో 8 నియోజకవర్గాలో మైదానాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు. క్రీడల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు పోటీలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామ సచివాలయ స్థాయిలో విజేతలకు స్పోర్ట్స్ కిట్స్‌తో పాటు మండల స్థాయిలో పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. మండల స్థాయి విజేతలకు నగదు బహుమతితో పాటు నియోజకవర్గ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. నియోజకవర్గ స్థాయి విజేతలకు నగదు బహుమతితో పాటు జిల్లా స్థాయిలో పాల్గొనేందుకు అర్హత లభిస్తుందన్నారు. జిల్లా స్థాయి విజేతలకు నగదు పురస్కారంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత లభిస్తుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబరు 1నుంచి 7వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 17ఏళ్లు పైబడి ఉండాలని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్ర పోటీలకు లోగో, మస్కట్ తయారు చేసేందుకు విద్యార్థుల్లో పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిని రూపకల్పన చేసిన వారు ఈనెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో లోగో, మస్కట్ పంపిస్తే అందులో ఉత్తమ లోగోను, మస్కట్‌ను ఎంపిక చేస్తారని చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.ఓబులేసు, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, సమగ్ర శిక్ష ఎపిసి జయప్రకాష్, గృహనిర్మాణ సంస్థ పీడీ గణపతి, చీఫ్ కోచ్ శ్రీధర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










