Aug 29,2023 23:14

పోస్టర్‌, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

* జయప్రదం చేయాలి : సిఐటియు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా లేబర్‌ కోడ్‌లు - కార్మిక వర్గంపై ప్రభావంపై అనే అంశంపై జాతీయ సెమినార్‌ను అక్టోబర్‌ 15, 16 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు, సంస్థలు, ప్రజలు సెమినార్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సెమినార్‌ బ్రోచర్లు, కరపత్రాలను నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సెమినార్‌కు సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి నాగేశ్వరరావు, సిహెచ్‌.నర్సింగరావు, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలతో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ తదితర నిత్యావసర నరుకుల ధరలు, విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. దీనివల్ల కార్మికుల నిజ వేతనాలు, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు సిఐటియు అనేక పోరాటాలు చేస్తోందని చెప్పారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తోందన్నారు. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా సిఐటియు అనేక ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. పలురంగాల కార్మికులు, మున్సిపల్‌, పంచాయతీ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, విఒఎ తదితర స్కీమ్‌వర్కర్లు, విఆర్‌ఎ, భవన నిర్మాణ, హమాలీ తదితర కార్మికులకు కనీస వేతనాల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతోందని వివరించారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇవ్వాలని చేసిన పోరాటాలకు మద్దతుగా సిఐటియు నిలబడిందన్నారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.వి రమణ, జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పాల్గొన్నారు.