కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు
అక్టోబర్2 నుంచి పాదయాత్రలు
ప్రజాశక్తి-కావలి రూరల్ :జిల్లా సమగ్ర అభివద్ధి సాధనకు సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ రెండవ తేదీ నుంచి రామాయపట్నం పోర్టు నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ యాత్రను సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రారంభిస్తారని అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కరపత్రాలను గురువారం సిపిఎం ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా కొత్త పరిశ్రమలు స్థాపించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడంతో లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారన్నారు. దీనివలన నిరుద్యోగం పెరిగిందన్నార. బిజెపి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాల మోపిందని తీవ్రంగా విమర్శించారు. ఈ పాదయాత్రలను అక్టోబర్ రెండున ప్రారంభించి ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, కొండాపురం, కలిగిరి ,జలదంకి, మండలాల మీదుగా వచ్చేనెల 9వ తేదీ కావలికి చేరుతుందని తెలిపారు. కావలి నుండి మరికొన్ని మండలాల మీదుగా వచ్చే నెల 13వ తేదీ నెల్లూరులో జరిగే బహిరంగ సభతో ముగిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకయ్య, పి.తిరుపాలు, వై.కష్ణమోహన్, పి.పెంచల నరసింహం, కృష్ణయ్య, పాల్గొన్నారు.










