ప్రజాశక్తి - బాపట్ల
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు మొదలు అన్నీ స్థాయిల ఉద్యోగుల సమస్యలపై అక్టోబర్ 1న జరిగే 17వ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా రెవిన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రెవిన్యూ భవనంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న పని భారం, ప్రభుత్వం నుండి బడ్జెట్ మంజూరు కాక అనేక కార్యక్రమాలకు స్వంత ఖర్చులు పెట్టుకుంటూ తీవ్రమైన ఆర్ధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు. రీ- సర్వే విషయంలో లెక్కకు మించి పెడుతున్న టార్గెట్లు పూర్తిచేయలేక విపరీతమైన ఒత్తిడిలో రెవిన్యూ సిబ్బంది మగ్గిపోతున్నారు. ఓటర్ల జాబితా సవరణలు రీ- వేరిఫికేషన్ చేయడంలో తగిన సమయం ఇవ్వకుండా తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి ప్రతి రెవెన్యూ ఉద్యోగి, గ్రామ రెవెన్యూ సహాయకుల నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామిసెట్టి వెంకట రాజేష్, గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం రాష్ట్ర సహా ధ్యక్షులు ఆరేపల్లి సాంబశివరావు, గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రంహయ్య, జిల్లా అధ్యక్షులు సిహెచ్ సురేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఓంకార్, కోశాధికారి కె శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కె నెహ్రూ బాబు, ఆర్ వాసుదేవరావు, ఎం మాధవి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం సత్యనారాయణ పాల్గొన్నారు.










