ప్రజాశక్తి-ఉలవపాడు :జిల్లా సమగ్రాభిóవద్ధి సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2 నుంచి 11 వరకు సిపిఎం ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు నుంచి పాదయాత్ర ప్రారంభమై అక్టోబర్ 11న నెల్లూరు చేరుకుంటుందన్నారు. 13న నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుందని సిపిఎం కందుకూరు నియోజకవర్గ నాయకులు జి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఉలవపాడు లోని వరిగ చేను సంఘంలోని కమ్యూనిటి హల్ వద్ద ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు ఎస్.డి. గౌస్ భాషా అధ్యక్షత న సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు. నేటికీ ప్రజా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రామాయపట్నంలో మేజర్ పోర్టును ఇస్తానని, వెనకబడిన కందుకూరు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానని చెప్పిన పాలకులు,ఆచరణలో మైనర్ పోర్టు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మేజర్ పోర్ట్ అయితే ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంత యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. సిపిఎం మండల కార్యదర్శిజీవీబీ కుమార్ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్వాసితుల తోపాటు ఈ ప్రాంతంలోని రైతులు, కూలీలు,కార్మికులు, యువత, విద్యార్థుల సమస్యలు పాదయాత్రలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 2న చేవూరులో ఉదయం 9గంటలకు ప్రారంభ సభ జరుగుతుందని ఈ సభలో సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. సిపిఎం ఉలవపాడు మండల నాయకులు కొమరగిరి వెంకటేశ్వర్లు, ఎస్. మాచర్లరావు,ఏలూరి నాగార్జున, కే.శేషమ్మ, దేవరకొండ కోటేశ్వరరావు, పొట్లూరి కోటేశ్వరరావు, ఎస్.కే మీరాసా, సిఐటియు నాయకురాలు సిహెచ్.ఇందిరా వతి ఉన్నారు.










