ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే నెల 15 తరువాత విధులు బహిష్కరిస్తామని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్ రావు హెచ్చరించారు. మంగళ వారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేస్తుందన్నారు. శాంతియుత నిరసనలకు అనుమతించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించకపోతే కలిసి వచ్చే సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. స్థానికంగా 4సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనెలు, చెప్పులు యూనిఫామ్ వంటి రక్షణ పరికరాలు ఇవ్వడం లేదన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన తుపాకుల రమణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చామని, వచ్చే నెల 4న నగర పంచాయతీ పెద్దలను కలుస్తామని, అక్టోబర్ 15 లోపు అధికారులు, పాలకవర్గం స్పందించకపోతే విధులను బహిష్కరించాల్సి వస్తుందని, అందుకు కార్మికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నగర పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కార్యదర్శి బాబురావు నాయకత్వంలో జరిగిన ధర్నాలో లక్ష్మి, దుర్గారావు, హరిబాబు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.










