Sep 03,2023 22:54

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు

ప్రజాశక్తి - రణస్థలం: సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యన్నారాయణ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా అక్టోబర్‌ 15, 16వ తేదీల్లో శ్రీకాకుళంలో జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు తెలిపారు. ఆదివారం రణస్థలంలో హైస్కూల్‌ ఆవరణలో సిఐటియు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమ్మన్నాయుడు మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యాన నిర్వహించే సెమినార్‌కు యూనియన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత, రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, సి.హెచ్‌.నర్సింగరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు హాజరవుతారని చెప్పారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను సెమినార్‌లో చర్చిస్తామన్నారు. జాతీయ సెమినార్‌ జయప్రదానికి ఉద్యోగులు, కార్మికులు, సంస్థలు, శ్రేయోభిలాషులు తోడ్పడాలని కోరారు. సమావేశంలో యునైటెడ్‌ బ్రేవరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఐ.నారాయణరావు, అంగన్వాడీ యూనియన్‌ రణస్థలం ప్రాజెక్టు అధ్యక్షులు బి.అప్పమ్మ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి కాంతమ్మ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి వి.లక్ష్మి, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వై.బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.