ప్రజాశక్తి - కర్నూలు క్రైమ్
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుడ్య పరీక్షలు జిల్లాలో వివిధ దశల్లో జోరుగా సాగుతున్నాయి. పోలీసు శాఖ బుధవారం ఈ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుడ్య పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఫైనల్‌గా రాత పరీక్షలను అక్టోబర్ 14, 15న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. పరీక్షల్లో మొత్తం 4 పేపర్లను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఇందులో 1, 2 పేపర్లు రాత పరీక్ష, 3, 4 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించింది. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. రాయలసీమ జోన్ పరిధిలోని అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షల నిర్వహణ నిమిత్తం కర్నూలు ఎపిఎస్‌పి 2వ బెటాలియన్ మైదానాన్ని వేదికగా నిర్ణయించింది. దేహదారుడ్య పరీక్షలు మొదలై ఇప్పటికే 5వ రోజు విజయవంతంగా పూర్తయ్యాయి. రాయలసీమ జోన్ పరిధిలో కర్నూలు రేంజ్ డిఐజి ఎస్.సెంథిల్ కుమార్, ఎస్పీ జి.కృష్ణకాంత్ దేహదారుడ్య సామర్థ్య పరీక్షలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. రాయలసీమ రేంజ్ పరిధిలో 16,108 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఇందులో 14,011 మంది పురుషులు, 2,097 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. రోజూ 800 మంది అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షల్లో పాల్గొంటారని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దేహదారుడ్య పరీక్షల్లో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో అత్యధిక సాంకేతికతతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి వివిధ జిల్లాల్లోని 300 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు.
దేహదారుడ్య పరీక్షలను పరిశీలిస్తున్న డిఐజి సెంథిల్ కుమార్ (ఫైల్)










