అక్టోబర్ 10, 11తేదీల్లో కలెక్టరేట్ వద్ద విఓఏల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం విఓఏల సమస్యలు పరిష్కారం చేయకుండా, మూడు సంవత్సరాలు కాలపరిమితి విధించడాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 10,11 తేదీల్లో రాష్ట్రకమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గురువారం చిత్తూరు సిఐటియు కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విఓఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేతనాలు పెంచుతానని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కొద్దిగా పెంచిన వేతనాలతో వీరందరినీ 64 సర్క్యులర్ తెచ్చి ఇంటికి పంపించే ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్నారు. మూడు సంవత్సరాల కాలపరిమితి విధించి అందర్నీ ఉపాధి దెబ్బతీసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదన్నారు. రాజకీయ వేధింపులతో ఇబ్బంది పడుతున్నారని వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే కొంతమంది చనిపోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలను ఆర్గనైజ్ చేస్తున్న వీవోఏలపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సమావేశాలకు జనం కావాలంటే తరలించడంలో వీవోఏలు లేకుండా సమావేశాలు జరుపుకోలేని పరిస్థితి ఉందన్నారు. అలాంటి వారిని రకరకాల పేర్లతో ఇబ్బందులు పెట్టడం సరైనది పద్ధతి కాదన్నారు. లోకో యాప్ పెట్టి వీరి నుండి సమాచారం సేకరించడానికి ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా, 5 జి సిమ్ ఇవ్వకుండా, ఫోన్లు ఇవ్వకుండా వారు ఎలా పని చేయాలని ప్రశ్నించారు. అలాగే జెండర్ విధానాన్ని రద్దు చేయాలని, వయసుతో నిమిత్తం లేకుండా కొనసాగించాలని, సంఘాల మెర్జింగ్ పద్ధతి మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 10,11రెండు రోజులు నిర్విరామంగా జరిగే ధర్నాను జిల్లాలోని అందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జీను రాజశేఖర్ అధ్యక్షత వహించగా నాయకులు శ్రీధర్, మంగమ్మ ,మాలతి, దేవిక ,మమత, తులసి దేవి, వీవోఏలు పాల్గొన్నారు.










