
* గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు సువ్వారి సువర్ణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం: అక్షరంతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సువ్వారి సువర్ణ అన్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్య ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం అవసరమని గుర్తించారన్నారు. బాలల కోసం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం శుభపరిణామన్నారు. గ్రంథాలయాల్లో అందరికీ అందుబాటులో అన్ని పుస్తకాలు ఉంటాయన్నారు. నేటి తరానికి గ్రంథాలయ విశిష్టతను వివరించేందుకు వారోత్సవాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 134వ జయంతి సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గ్రంథాలయ కార్యదర్శి బి.కుమార్ రాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించుకొని గ్రంథాలయానికి రావాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా 15న పుస్తక ప్రదర్శనల ఏర్పాటు, మాదకద్రవ్యాలపై అవగాహన, పుస్తక పఠన ప్రాముఖ్యత, 16న గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య తదితరులను స్మరించుకోనున్నట్లు చెప్పారు. 17న కవితా దినోత్సవం, సెమినార్‌లు, రచయితల సందేశాలు, 18న పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడల పోటీలు ఉంటాయన్నారు. 19న మహిళా దినోత్సవం, ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు 20న అక్షరాస్యతా దినోత్సవం, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఉంటాయని వివరించారు. అంతకుముందు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్‌సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రతినిధి సువ్వారి సత్యనారాయణ (ఢిల్లీ), డాక్టర్ సోమేశ్వరరావు, ఇ.ఎస్ సంపత్ కుమార్, ఉప గ్రంథాలయ అధికారి వి.వి.ఎస్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.