ప్రజాశక్తి - ఆదోని
అక్షరాలతో రూ.లక్షల వ్యాపారం చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్‌పిఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలల ముందస్తు అడ్మిషన్లు, ప్రచారాలు చేసే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌పిఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడారు. పట్టణంలో అక్షరాలతో వ్యాపారం చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వ జిఒలకు విరుద్ధంగా ర్యాంకుల పేరుతో ప్రచారాలు చేస్తున్న స్కూళ్లపై ప్రభుత్వ విద్యా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యా సంవత్సరం ముగియక ముందే విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయని తెలిపారు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ, నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పారు. విద్యాధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ విద్యా నిబంధనలకు విరుద్ధంగా నడిపే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎంఇఒ, డిఇఒ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. వీరేష్, జనార్ధన్, అరవింద్, రాజు, కిరణ్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నాయకులు










