అక్షరాలన్నీ మహా యజ్ఞాన్ని తలపెట్టాయి
అవి సమిధలుగా మారి అగ్నిలో
ఆహుతి అవుతున్నాయి.
ధగధగమని మండి పదునైన పదాలుగా మారి
కవిత్వాన్ని అల్లుతున్నాయి
లోకకల్యాణం కోసం
కంకణం కట్టుకుంటున్నాయి
ఆ మహాయజ్ఞం కవిపండితులు తలపెట్టిన యజ్ఞం
మహనీయుల ఆలోచనల మెదళ్ల నుండి
పుట్టుకొచ్చిన యజ్ఞం
విశ్వంభర సినారె నాధాలై..
శ్రీశ్రీ మహాప్రస్థానాలై
నా గొడవల కాళోజీ కథలై....
వేయిపడగల విశ్వనాథుని రచనలై.. దాశరథి అగిధారలై..
సామల సదాశివుడి
యాదిలో నిలిచి..
సురవరం మొగళాయి కథలై...
చెరబండ రాజు కవిత్వాలై
అవి అగ్నిజ్వాలలుగా మారి...
జ్ఞాన జ్యోతులను వెలుగిస్తున్నాయి
అక్షరాలన్నీ పేదవాడి కష్టాన్ని సంకనేసుకొని..
శ్రమజీవుల స్వేదపు చుక్కల వెంట నడుస్తున్నాయి.
వలసజీవుల కన్నీరును తుడుస్తున్నాయి.
హాలికుడి అడుగులో అడుగువేస్తూ భుజంతట్టి ముందుకు నడిపిస్తున్నాయి
మానవుని మదిలో ప్రయత్నం అనే వెలుగుపూలు పూయిస్తున్నాయి
పదునైన అక్షరాలుగా మారి దండుకట్టి కదులుతున్నాయి.
పదాలన్నీ పెనవేసుకొని ....
కవితలై అల్లుకొని సమాజహితం కోసం
పరితపిస్తున్నాయి.
మహాయజ్ఞం ఎప్పటికీ ఆరదు
నిప్పుకణికలై మండుతుంది
వేయిగొంతుకలై కదులుతుంది
కోటానుకోట్ల దీపాలను వెలిగిస్తుంది
భువిపై కవితాక్షరాల విత్తనాలుగా మారి
మహావృక్షాలై ఎదుగుతాయి
మరో కవితా ప్రపంచాన్ని సృష్టిస్తాయి
అశోక్ గోనె
94413 17361