Mar 31,2021 07:04

ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991 పున:పరిశీలనకు ఇటీవల సుప్రీం కోర్టు దారులు తెరవడం ఆందోళన కలిగించే పరిణామం. 1947 ఆగస్టు 15కి ముందు ఉనికిలో ఉన్న ప్రార్థనా స్థలాల స్వభావాన్ని యథాతథంగా కొనసాగించాలని 1991 చట్టం స్పష్టం చేస్తున్నది. అయోధ్యలో రామ జన్మభూమి వివాదంపై 2019 నవంబరు 9న అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సంయుక్తంగా వెలువరించిన తీర్పులో ఈ చట్టం చెల్లుబాటు తిరుగులేనిదంటూ గట్టిగా సమర్థించింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఉనికిలో ఉన్న ప్రార్థనా స్థలాల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాల్సిందేనని చెబుతున్న ఈ చట్టాన్ని రాజ్యం, పౌరులు ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ చట్టం ఉనికిలోకి వచ్చేటప్పటికే అయోధ్యలో బాబ్రీ-రామజన్మభూమి వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఆ కేసు వరకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
రాజ్యాంగ మౌలిక లక్షణమైన లౌకిక భారత దేశ చట్రానికి వెన్నుదన్నుగా ఉన్న రెండు ముఖ్యమైన సెక్షన్లను బిజెపికి చెందిన అశ్విని ఉపాధ్యాయ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ద్వారా సవాల్‌ చేయడం, ఆ వెంటనే కోర్టు దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరడం చకచకా జరిగిపోయాయి. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తీసుకున్న ఈ చర్య పలు విమర్శలకు తావిచ్చింది. 1991 చట్టాన్ని తిరిగి పరిశీలించడమంటే సంఫ్‌ు పరివార్‌ ఎజెండాకు ఊతమివ్వడమే. మధ్య యుగంలో ముస్లిం పాలకులు హిందువుల ఆలయాలను ఆక్రమించుకున్నారని, వాటిని 'విముక్తి' చేయడమే తమ లక్ష్యమని ఆరెస్సెస్‌ ఇప్పటికే చేస్తున్న విద్వేష ప్రచారానికి ఇది మరింత బలం చేకూర్చేదిగా ఉంది. అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణం చేపట్టాలంటూ దేశ వ్యాపితంగా మత కల్లోలాన్ని రేపి కేంద్రంలో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు తన అధికారాన్ని పటిష్టపరచుకునేందుకు హిందూత్వ ఎజెండాను మరింత తీవ్రతరం చేయాలని చూస్తోంది. అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరిగిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలోనే బిజెపి నేత వినరు కటియార్‌ కాశీ, మధురల్లో మసీదుల గురించి ప్రస్తావించారు. మధురలో శ్రీకృష్ణ ఆలయానికి సమీపంలోని షాహి ఈద్గాను, కాశీలోని విశ్వనాథ ఆలయానికి దగ్గరలోని గ్యాన్‌్‌ వాపి మసీదును తొలగించాలన్న ఆరెస్సెస్‌ డిమాండ్‌ దేశంలో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదముంది. కరోనా మహమ్మారితో దేశం ఒక వైపు తల్లడిల్లుతున్న సమయంలో కాశీ, మధురపై కృష్జ జన్మభూమి ముక్తి ఆందోళన ట్రస్టు, అఖిల భారతీయ సంత్‌ ముక్త యజ్ఞ సమితి, అఖిల భారతీయ అఖండ్‌ పరిషత్‌ వంటి వాటిని ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసింది. దానికి కొనసాగింపే 1991 ప్రార్థనా స్థలాల చట్టం పై జరిగిన ఈ దాడి. పిటిషనర్‌ ఈ సందర్భంగా తీసుకొచ్చిన వాదన చాలా విచిత్రంగా ఉంది. 1192 నుంచి 1947 వరకు గల మధ్య కాలంలో దేశం పై దండెత్తిన దురాక్రమణదారులు ఆక్రమించుకున్న ప్రార్థనా స్థలాలను తిరిగి విముక్తం చేయకుండా 1991 చట్టం అడ్డుపడుతోందని పిటిషనర్‌ వాదించారు. ఈ వాదన చాలా ప్రమాదకరమైనది. చరిత్రలో వెనక్కి వెళ్లి జరిగాయని చెబుతున్న ప్రతి తప్పును సరిదిద్దడం మొదలెడితే దానికి ఇక అంతం ఎక్కడీ ఇటువంటి చర్యలతో మానవ నాగరికత మనుగడ సాగించలేదు. చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే పేరుతో అధికారంలో ఉన్న వారు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎంతమాత్రం అనుమతించరాదని సుప్రీం కోర్టు గతంలో పలు కేసుల్లో స్పష్టం చేసింది. చరిత్రను, తప్పిదాలను సాకుగా చేసుకుని వర్తమానాన్ని, భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకమని రాజ్యాంగ నిపుణులు, లౌకికవాదులు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు కూడా ఇదే అభిప్రాయాన్ని ఉద్ఘాటించింది. సుప్రీం కోర్టు 1991 యాక్టును పున:పరిశీలించే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. ఈ చట్టాన్ని బలహీనపరిచేందుకు గతంలో అలహాబాద్‌ హైకోర్టు న్యామూర్తి జస్టిస్‌ డి.వి.శర్మ తీర్పు ఇచ్చినప్పుడు దానిని నిర్ద్వంద్వంగా కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడీ పిటిషన్‌ విషయంలో దానికి భిన్నమైన వైఖరి తీసుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.