
ప్రజాశక్తి- గరివిడి : స్థానిక డిఎఫ్‌ఎన్‌లోని రాధిక మెటల్ అండ్ మినరల్స్ సంస్థకు చెందిన ఆక్సైడ్ ప్లాంట్ మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సిఐటియు గరివిడి డివిజన్ కార్యదర్శి అంబళ్ల గౌరి నాయుడు ఆధ్వర్యంలో శనివారం కార్మికులు ఆందోళన బాట పట్టారు. కొద్ది రోజులుగా ఆక్సైడ్ ప్లాంట్ పనులు నిలిపివేసి, ఇక్కడి కార్మికులకు పని దినాలను తగ్గిస్తూ రావడమే కాకుండా వేతనాలు పెంచాలని కోరడంతో, పూర్తిగా కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా పరిశ్రమ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టిన కార్మికులు శనివారం సంస్థకు చెందిన లారీలు ఇతర వాహనాలను అడ్డుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. స్థానిక ఎస్‌ఐ దామోదర్ కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతోనూ మాట్లాడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కార్మికులకు సూచించడంతో వాహనాలను విడిచి పెట్టారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని అంబల్ల గౌరీ నాయుడు తెలిపారు.