గత వారం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పెద్ద పరిణామాల్లో ఒకటి ఆకస్ కూటమి ఏర్పాటు. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములను కడుతున్నది. బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన అగ్రరాజ్యం తాజాగా బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలసి ఆకస్ కూటమిని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది. అమెరికా చర్య అణువ్యాప్తి నిరోధక ఒప్పందానికి నిలువునా తూట్లు పొడవడమే కాదు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు తీవ్ర ముప్పు తెస్తుంది. జూన్‌లో కార్నివాలిస్‌లో జరిగిన జి-7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా బైడెన్, బోరిస్ జాన్సన్ మధ్య జరిగిన రహస్య చర్చల్లో దీనికి బీజం పడింది. ఈ నెల 24న బైడెన్ అధ్యక్షతన వైట్ హౌస్‌లో జరిగే క్వాడ్ కూటమి నేతల సమావేశంలో ఆకస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావచ్చు. కృత్రిమ మేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, జలాంతర్గాముల సామర్థ్యం, ఇతర అధునాతన రక్షణ వ్యవస్థల్లో సహకారం పెంపొందించుకోవడమే ఆకస్ ప్రధాన ఎజెండాగా ఉంటుందని కూటమి నేతలు బయటకు చెబుతున్నప్పటికీ దీని అసలు లక్ష్యం చైనాకు వ్యతిరేకంగా అణు యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేయడమేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆకస్ కూటమి ఏర్పాటు ఓ చారిత్రాత్మక ముందడుగు అని బైడెన్ అంతగా సంబరపడడానికి, బ్రిటన్ వ్యూహంలో 'ఇదొక నూతన స్తంభం' వంటిదని బోరిస్ జాన్సన్ ఉబ్బితబ్బిబ్బవడానికి ప్రేరణ ఇదే. ఆస్ట్రేలియా వంటి అణుయేతర దేశంతో అమెరికా, బ్రిటన్ అణు సబ్‌మెరైన్ టెక్నాలజీ పంచుకోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్‌పై ఆంక్షలతో విరుచుకుపడిన అమెరికా, ఏ ప్రయోజనం లేనిదే ఆస్ట్రేలియాకు ఈ అణు టెక్నాలజీ బదిలీ చేస్తుందని అనుకోలేము. అమెరికా కట్టే ఏ కూటమి అయినా, అది కుదుర్చుకునే ఏ ఒప్పందం అయినా తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. చివరికి తన మిత్రులను వంచించేందుకు సైతం వెనుకాడదు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో తనకు నమ్మకమైన కాపలాదారుగా వుంటూ, తన ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆస్ట్రేలియాలోని మితవాద ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందిన మీదటే అణు సబ్‌మెరైన్ టెక్నాలజీ ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ఈ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో తనతో పాటు కలసి పనిచేసిన మిత్ర దేశానికి వెన్నుపోటు పొడిచింది. అమెరికా చర్య వల్ల ఫ్రాన్స్ 9,000 కోట్ల డాలర్ల విలువైన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్ మెరైన్ల కాంట్రాక్టును కోల్పోయింది. ఫ్రాన్స్‌తో ఇదివరకే కుదుర్చుకున్న కోలిన్స్ క్లాస్ సబ్‌మెరైన్ల కొనుగోలు ఒప్పందాన్ని అమెరికా అణు సబ్‌మెరైన్ల కోసం ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా చర్యపై ఆగ్రహంతో రగిలిపోతున్న ఫ్రాన్స్ ఆ రెండు దేశాల నుంచి తన రాయబారులను వెనక్కి రప్పించింది. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు యూరోపియన్ యూనియన్ బాసటగా నిలిచింది. ఆకస్ కూటమికి దూరంగా ఉంటామని, అవసరమైతే నాటో కూటమి నుంచి వైదొలగుతానని ఫ్రాన్స్ చేసిన హెచ్చరిక మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. క్వాడ్ ఉండగా ఆకస్ పేరుతో మరో త్రైపాక్షిక కూటమిని ముందుకు తేవడం ద్వారా బైడెన్ ప్రభుత్వం తన ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్, జపాన్‌ల కన్నా ఆస్ట్రేలియాకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నది. అణు జలాంతర్గాముల కోసం మోడీ ప్రభుత్వం బైడెన్ ముందు ఎంతగా లొంగుబాటు ప్రదర్శించినా ఉపయోగం లేకపోయింది. అగ్రరాజ్యం నైజం తెలిసి కూడా ఆ దేశంతో వ్యూహాత్మక పొత్తును అన్ని రంగాలకు విస్తరింపజేస్తూ, ఇరుగు పొరుగు దేశాలను భారత్ దూరం చేసుకుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ లొంగుబాటు వైఖరిని వీడాలి.










