క్యూ కట్టిన పర్యాటకులు
ప్రజాశక్తి -సీలేరు
విశాఖ మన్యంలో మంచు సోయగాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు తిలకించడానికి పర్యాటకులు మంగళవారం క్యూ కట్టారు. జీకే వీధి మండలం దారకొండ ఘాట్ రోడ్డు దారాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో ఎత్తయిన కొండలు నడుమ జాలువారే జలపాతాలు, మంచు సోయగాలను పర్యాటకులు ఆస్వాదించి మంత్రముగ్ధులయ్యారు. మన్యంలో పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన లంబసింగిలో కాశ్మీరును తలపించే మంచు అందాలను తిలకించి వారి కెమెరాల్లో ఫోటోలు బంధించి ఎంతో అనుభూతిని పొందారు. అదే రహదారి గుండా ప్రయాణిస్తూ గిరిజనులు పండిస్తున్న స్ట్రాబెరీ తోటలు సందర్శించి పర్యాటకులు సందడి చేశారు. చింతపల్లి నుంచి గూడెం వరకు దారి పొడవునా కాఫీ తోటలు, మిరియాల పాదులు, లవంగి యాలిక దాసిన చెక్క చెట్లను చూసి పర్యాటకులు మురిసిపోయారు. అదే రహదారి కొండ దారకొండ ఆలయానికి చేరుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందాలను తిలకించారు. అనంతరం ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. సప్పర్ల సమీపంలో రెయిన్ గేజ్ సీలేరు కాంప్లెక్స్ సమీపంలో ఐస్ గడ్డ అందాలు తదితరు అందాలును పర్యాటకులు తిలకించి పరవశించిపోయారు.










