Jul 25,2022 23:10

మురుగుకాలువ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న దుకాణం

అధికారుల తీరు చూసి విస్తుపోతున్న ప్రజలు
ప్రజాశక్తి -పిఎం పాలెం
: మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించకుండా డ్రైనేజీలను నిర్మిస్తున్న జివిఎంసి అధికారులు తీరును చూసి అంతా విస్తుపోతున్నారు. ఆక్రమణదారులకు అండగా అధికారుల చర్యలు ఉన్నాయని, ఇలాగే కాలువలు నిర్మాణం చేపట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదని, మురుగునీరు మళ్లిపోదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే....
ఆరో వార్డు పరిధి కొమ్మాది సమీపంలో జిసిసి లేఅవుట్‌లో చేపడుతున్న కాలువల నిర్మాణం అక్రమణదారులను ప్రోత్సహించేలా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొమ్మాది మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు సమీపంలో కాలువపై ఉన్న దుకాణాలు తొలగించకుండానే అధికారులు కాలువ నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ పైపులైన్‌ కుంగిపోయి మురుగునీరు, తాగు నీటి పైపులైన్‌కు ఇబ్బందులు ఎదురవడంతో రూ.8.6 లక్షలతో కల్వర్టు నిర్మిస్తున్నారు. అయితే 30 మీటర్ల కల్వర్టును అనుకొని కాలువపై ఉన్న దుకాణాలను తొలగించకుండా నిర్మిస్తే మురుగు నీరు ప్రవాహానికి అడ్డంకి తప్పదని అంటున్నారు. దీనిపై పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులను అడిగితే, దుకాణాల తొలగింపు పని తమది కాదంటున్నారు. అయితే మురుగనీరు మళ్లే అవకాశం లేకుండా అరకొరగా కాలువ నిర్మిస్తే ప్రయోజనం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. జివిఎంసి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.