ప్రజాశక్తి - నిడమర్రు
మండలంలోని భువనపల్లి ఏరియాలో సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని సిపిఎం మండల కన్వీనర్ నారపల్లి రమణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ సాయిరాజుకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ మురుగు డ్రెయిన్ కాలువను సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలని రైతులు మూడు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడంలేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామని తహశీల్దార్ బి.సాయిరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోడూరు త్రిమూర్తులు, అలుమోలు సత్యనారాయణ, దూలం గౌరీశంకర్ పాల్గొన్నారు.










