ప్రజాశక్తి - దెందులూరు
భూస్వాముల నుండి భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, దోసపాడు భూ పోరాట కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం దోసపాడులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి మాట్లాడుతూ అసైన్డ్, సీలింగ్, గయాళ భూములను 25 ఏళ్లుగా దేవినేని భాజీప్రసాద్, అయన అనుచరులు, బినామీలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు భూములను అప్పగించాల్సిన జిల్లా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై లంచాలు బొక్కి దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్మెంట్ చట్టం ప్రకారం భూములు దళితులకు చెందినవేనని, కానీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు ఈ విషయాన్ని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెలల నుంచి పేదల భూములు పేదలకు ఇవ్వాలని కోరుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చట్ట ప్రకారం పేదలకు చెందిన భూములు పేదలకు ఇవ్వాలని కోరారు. అక్రమంగా భూములు అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25న సిఎం జగన్ దెందులూరు పర్యటనలో భాగంగా దోసపాడు పేదల గురించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టే విధంగా కలెక్టర్, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యకాస జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడులో 144, 145 సెక్షన్ ఎత్తివేయాలని, భూస్వాముల నుండి భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. సిఎం జగన్ జిల్లా పర్యటనలో భాగంగా దోసపాడు పేదలకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలని కోరారు. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు, రాజకీయ నాయకుల, అమలు చేయడం లేదని మండిపడ్డారు. అధికారులు భూస్వాములకు కొమ్మకాస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో పేదలకు చెందిన ప్రభుత్వ భూములు 16 రకాలున్నాయని వాటిలో అసైన్మెంట్ భూములు దోసపాడు, కొవ్వలి, పోతునూరు గ్రామాల్లో వందల ఎకరాలను భూస్వాములు ఆక్రమించుకుని అక్రమంగా అనుభవిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు స్పష్టమైన రాతపూర్వక హామీలు ఇస్తేనే ఈ దీక్షలు ఆపుతామని లేని పక్షంలో మరోమారు భూముల్లోకి వెళ్లి చేపలు పట్టే కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈ దీక్షలో జిల్లా కమిటీ సభ్యులు పి.ఆనందరావు, మండల నాయకులు డి.నాగేంద్ర, కుమారి, లక్ష్మి, మాణిక్యం, దీవెనమ్మ కూర్చున్నారు. మరో 50 మంది వీరికి మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.










