ప్రజాశక్తి-శృంగవరపుకోట : పట్టణంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా చెరువులు, వాగులు, వంకలు, బందలు, గెడ్డ పోరంబోకు భూములు ఇలా దేన్నీ వదలడం లేదు. తాజాగా బర్మా కాలనీ, శాలి వీధి, శ్రీనివాస కాలనీల గుండా ప్రవహించి ఆర్టీసీ డిపో వెనుకన ఉన్న సుమారు 300 ఎకరాల సాగు భూమికి నీరిందించే రాజుల చెరువులో కలిసే పుణ్యగిరి జీవ గెడ్డ ఆక్రమణలకు గురవుతోంది. ఇది రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తోంది. ఈ గెడ్డ ఆక్రమణలతో కొన్నిచోట్ల కుచించికి పోయింది. సాలివీధి సరిహద్దుల్లో గెడ్డ మలుపు తిరిగిన చోట్ల కొంతమేర చదును చేసి పునాదులను నిర్మించేశారు. వందేళ్ల క్రితం ఇది ప్రవహించే ప్రాంతాలలో వ్యవసాయం చేసేందుకు ఉపయోగపడగా, రజకులు ఈ గెడ్డలో బట్టలు ఉతుక్కుంటూ తమ వృత్తిని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో భూముల విలువలకు రెక్కలు రావడంతో పుణ్యగిరి గెడ్డ ఆక్రమణలకు గురై నేడు కాలువలా మారిపోయింది. ఇందులో విఆర్ఒలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
నీటి వనరులను కాపాడండి
ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణంతో పుణ్యగిరి గెడ్డ ఆక్రమణలు మొదలయ్యాయి. గెడ్డను ఆనుకొని ఉన్న భూములను జిరాయితీ భూములుగా పేర్కొంటూ గెడ్డ భూమిని ఆక్రమిస్తున్నారు. విఆర్ఒలు కబ్జాదారులకు సహకరిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకొని హద్దులు నిర్ణయించకపోతే మున్ముందు పుణ్యగిరి గెడ్డ ఆనవాళ్లు కనుమరుగయ్యే అవకాశం ఉంది.
మద్దిల రమణ, సిపిఎం మండల కార్యదర్శి
తాతల కాలం నుంచి రజక వృత్తి చేస్తున్నాం
తాతల కాలం నుంచి గ్రామస్తుల బట్టలను ఈ పుణ్యగిరి గడ్డలో ఉతుక్కుంటూ జీవనం సాగిస్తున్నాం. గెడ్డలో ఉండే చెట్లను తొలగించి ఇరువైపుల నుంచి మట్టిని పోస్టు గెడ్డ విస్తీర్ణాన్ని తగ్గిస్తూ గెడ్డను కాలువలా చేస్తున్నారు. మట్టిని పోసి గెడ్డలో ఉన్న నందనూతులను, బట్టలు ఉతికే బల్లలను కొన్నింటిని కప్పేశారు. గెడ్డను ఆక్రమణల నుంచి కాపాడాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇటీవల కాలంలో ఆక్రమణదారులు పెట్రేగిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నాం.
గంధవరపు సన్యాసిరావు, రజక వృత్తిదారుడు
ఆక్రమణలపై సర్వే చేస్తాం
పుణ్యగిరి గడ్డ ఆక్రమణలకు గురైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వేర్లను, విఆర్ఒలను పంపించి సర్వే చేస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పుణ్యగిరి గెడ్డ ఆక్రమించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
తహశీల్దార్ శ్రీనివాసరావు శృంగవరపుకోట