Sep 26,2023 22:16

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గంగునాయుడు

సాలూరురూరల్‌: పేదలకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన డి-పట్టా భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక వ్యవసాయ కార్మికసంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పేదలకు, గిరిజనులకు డి పట్టా, అసైన్డ్‌ భూములను రెగ్యులర్‌ చేస్తూ 9/77 చట్టాన్ని సవరణకు తీసుకొచ్చిందని, ఈ చట్టం వల్ల జిల్లాలోని గిరిజన, దళిత, పేదల వద్ద ఉన్న భూములు పెద్దల వద్దకు చేరిపోతున్నాయని అన్నారు. ఈ ప్రాంతానికి 30,40 ఏళ్ల కిందట వచ్చి స్థిరపడిన పెత్తందారులు ఇక్కడున్న పేద గిరిజన, దళిత రైతుల వద్ద అతి తక్కువ ధరలకు తక్కువ విస్తీర్ణం అని చెప్పి ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములను ఆక్రమించుకున్నారని తెలిపారు. వాస్తవ హక్కుదారుల వద్ద భూముల్లేవని, వాటిని కొందరు రెవెన్యూ అధికారులు మాత్రం ఎవరైతే ఆక్రమించుకున్నారు వారి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారిని వెంటనే సరెండర్‌ చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన భూములను నిజమైన హక్కుదారులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే వారి పై పిఒటి చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ భూముల జాబితాను విఆర్‌ఒలకు ఇచ్చి వాస్తవ హక్కుదారులను, సాగుదారులను గుర్తించి వారి పేర్లను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలని చెప్పినా ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క సచివాలయంలోనూ జాబితా పెట్టలేదని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం సేకరించని విఆర్‌ఒలపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని, లేకుంటే వాస్తవ హక్కు దారులతో అన్యాక్రాంతమైన భూములపై వెళ్లాల్సి ఉంటుందన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని తెలిపారు.