ఆక్రమణ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
- ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్
ప్రజాశక్తి-కావలి : తుమ్మలపెంట రోడ్డును ఆనుకొని ఉన్న కావలిలోని కొండేపి కాలువను రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారులు ఆక్రమించారని ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. దీనిపై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండేపి కాలువ పంటపొలాలను కలుపుతూ తిరిగి పంట పొలాలను కలుపుతూ చిప్పలేరువాగులో కలుస్తుందన్నారు. కావలి పట్టణంలోని రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారస్తులు ఆక్రమించి లేఅవుట్లు వేశారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వేసిన లేఔట్లను పరిశీలించిన బృందం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినట్లుగా భావించిందన్నారు. రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారస్తులు ప్రభుత్వ స్థలాలైన పంట కాలువలు, వరద కాలువలు, కుంటలు, పోరంబోకు, అసైన్డ్ భూములను ఆక్రమించి లే అవుట్లు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ముడుపులు తీసుకొని బిచ్చగాడి అనుమతులు ఇచ్చారని తెలిపారు. పంట పొలాలను విచ్చలవిడిగా కన్వర్షన్ చేసి ఇస్తున్నారని, అసలు అధికారులు భూమిలోకి వచ్చి చూసి కన్వర్షన్ చేస్తున్నారా లేక ఆఫీసుల్లో కూర్చొని కన్వర్షన్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించారు. కావలి నియోజకవర్గంలో ఉన్న పంట పొలాలను, కుంటలను, అసైన్డ్ భూములను రీసర్వే చేసి కంచె వేయాలని అధికారులను కోరారు. కావలి ఎంఎల్‌ఎ ంామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భాగస్వామ్యంతో, అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగించారన్నారు. నుడా అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేవట్లు వేశారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలకు కాపలాదారుడుగా ఉండాల్సిన ఎంఎల్‌ఎ, ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన ఎంఎల్‌ఎ ప్రభుత్వ స్థలాలను భక్షిస్తున్నారన్నారు. కావలికి ఎంఎల్‌ఎ ఒక శాపంగా అధికారులు మరొక శాపంగా తయారయ్యారన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వేసిన అక్రమ రియల్ ఎస్టేట్ లేఅవుట్లను తొలగించకపోతే భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యక హక్కుల పరిరక్షణ వేదిక బృందంలో కన్వీనర్ కరవది భాస్కర్, జ్యోతి బాబురావు (టిడిపి), చింతాల వెంకట్రావు (కాంగ్రెస్), పసుపులేటి పెంచలయ్య (సిపిఎం), కొప్పర్తి నాగరాజు (సిపిఐ), పొబ్బ సాయివిటల్ (జనసేన) లతో పాటు నాగార్జున, వెంకీ, హఫీజ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.










