Aug 27,2023 23:26

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో సిఐ, ఎస్‌ఐలు


ప్రజాశక్తి- కారంచేడు
గోవా నుంచి చీరాలకు అక్రమంగా తరలిస్తున్న 140 మ్యాన్షన్‌ హౌస్‌ మద్యం బాటిళ్లను కారంచేడు పోలీసులు ఆదివారం నాడు పట్టుకున్నారు. చీరాల రాంనగర్‌కు చెందిన ఓ మహిళ గోవా నుంచి వాస్కోడిగామా రైల్వే స్టేషన్‌ వద్ద మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి చీరాలలో ఎక్కువ రేటుకు లాభాలకు అమ్ముకుంటానికి కారులో తరలిస్తుండగా పోలీసులు అందిన సమాచారంతో స్థానిక కాల్వ సెంటర్లో కాపు కాసి వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇంకొల్లు సీఐ వి సూర్యనారాయణ మాట్లాడుతూ అక్రమ మద్యం తరలిస్తున్న మహిళను, కారు డ్రైవర్‌ని, కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని గాని, మత్తు పదార్థాలను గాని తరలిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్ళను పట్టుకున్నందుకు గాను బాపట్ల జిల్లా ఎస్‌పి వకూల్‌ జిందాల్‌ ఇంకొల్లు సీఐ సూర్యనారాయణను, కారంచేడు ఎస్‌ఐ జి శ్రీనివాసరావును ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.