
ప్రజాశక్తి కోటవురట్ల:మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో నిత్యం మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు, సచివాలయాల సిబ్బంది పట్టించుకో లేదు. లింగా పురం, కైలాస పట్నం, సుంకపూరు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో రాత్రి పగలని తేడా లేకుండా అక్రమంగా మట్టి రవాణా జరుగుతుంది. సామాన్యుల ఇంటికి ఒక ట్రాక్టర్ మట్టి కావాలంటే అధికారుల దగ్గర్నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ అధికారులు పర్మిషన్ ఇచ్చినా స్థానిక నేతల అనుగ్రహం కూడా ఉండాలి.స్థానిక నేతల అనుగ్రహం లేకుండా అధికారుల నుంచి మట్టి పర్మిషన్ తీసుకున్న మట్టి మాత్రం ఇళ్లకు చేరదు. ఇటువంటి తరుణంలో స్థానిక అవసరాల కోసం లబ్ధిదారులు మట్టి మాఫియా గ్యాంగ్ సంప్రదించాల్సిందే. వాళ్లు ఎంత అడిగితే అంత ఇచ్చి మట్టి తోలుకోవాల్సిన పరిస్థితి.
మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో అక్రమ లేఔట్లకు మట్టి రవాణా సాగుతోంది. స్థానిక నాయకుల అండదండలతో ఆయా గ్రామాల్లో చెరువుల నుండి మట్టి అక్రమంగా తరలి పోతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించుకున్న దాఖలాల లేవు.
ఒక్కో సచివాలయంలో దాదాపు పది మంది సచివాలయ సిబ్బంద్లి, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకులు ఇంతమంది నిత్యం ఆయా గ్రామాల్లో విధుల్లో ఉన్నా మట్టి అక్రమంగా రవాణా జరుగుతుంది.బుధవారం ఉదయం లింగాపురం ట్యాంకు నుండి మట్టి అక్రమ రవాణా జరుగుతుండగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడకు వెళ్లేసరికి వాహనాలను సంకపూర్ తరలించి అక్కడి నుంచి మట్టి తరలించేందుకు సిద్ధమయ్యారు. జగనన్న ఇళ్ల కాలనీలకు మట్టిని తరలిస్తున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవానికి జగనన్న కాలనీలకు ఒక్కో లబ్ధిదారుడికి రెండు నుంచి మూడు ట్రాక్టర్ల కంటే మట్టి అవసరం ఉండదు. జగనన్న ఇంటి నిర్మాణం కోసం మట్టికి కనీసం సచివాలయ ఇంజనీర్ అనుమతి కూడా తీసుకోకుండా రవాణా సాగిపోతుంది. రాత్రి సమయంలో అక్రమంగా మట్టి రవాణా కారణంగా రహదారులన్నీ మట్టి రోడ్లుగా దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని పరిసర ప్రాంత వాసులు కోరుచున్నారు.