Jun 20,2023 19:20

కాలువపై పర్యటించి రైతులతో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
తుంగభద్ర జలాశయ విభాగంలోని, ఆలూరు బ్రాంచి కాలువపై అనధికారికంగా మోటార్లు పెట్టి సాగునీటి జలచౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్‌ డిఇ మంజునాథ్‌, తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ రైతులకు తెలిపారు. మంగళవారం ఎంపిపి జూటూరు హేమలత మారయ్య ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ అధికారులు, ఆలూరు బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు రైతులతో కలిసి చిప్పగిరి, ఏరూరు, మల్లికార్జున పల్లె, డేగలహాలు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇ మంజునాథ్‌, తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఆగస్టులో ఆలూరు బ్రాంచి కెనాల్‌కు నీరు విడుదల అవుతున్నట్లు తెలిపారు. కాలువపై అనధికారికంగా రైతులు అక్రమమైన మోటార్లు పెట్టి నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని, అలాంటి రైతులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కొంతమంది రైతులు వారి పొలాల్లో పైపులైన్లు వేసుకున్నారని, వారిని అడిగే హక్కు తమకు లేదని తెలిపారు. ఎప్పుడైతే కాలువలో పైపులేసి సాగునీరు పంపిణీ చేస్తారో అప్పుడు కాలువపై పర్యటించి, మోటార్లను కూడా ధ్వంసం చేస్తామని, ముందే రైతులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రైతులు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. ఎబిసి కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, కాలువకు నీటి పంపిణీ జరుగుతుందన్నారు. ఆలూరు బ్రాంచి కెనాల్‌ ఎఇ తిమ్మారెడ్డి, డేగలహాల్‌ సర్పంచి నీలకంఠ, రైతులు పోతన్న, ధనుంజయ, లాల్‌ స్వామి, లింగన్న పాల్గొన్నారు.