
ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోట గ్రామంలోని మణికంఠ షామిల్లులో డిఎఫ్‌వో రాజారావు బృందం శనివారం దాడులు చేశారు. ఆ షామిల్లులో అనుమతులు లేకుండా కలపను భారీ ఎత్తున నిల్వ చేస్తున్నట్టు ముందస్తు సమాచారం అందడంతో డిఎఫ్‌ఓ రాజారావు సిబ్బందితో ఆ షామిల్లులో తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.25 వేల విలువ గల టేకు, గన్నెర, పాసి కలప ఉన్నట్టు గుర్తించారు. ఆ కలపను స్వాదీనం చేసుకున్నారు. షామిల్లు యజమాని పై కేసు నమోదు చేసినట్టు డిఎఫ్‌ఓ రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. షామిల్లులలో అనుమతులు లేని కలపను నిల్వ చేయడంతో పాటు కటింగ్ చేయడం నేరమేనని అటువంటి వాటిపై చర్యలు. తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడి వాడ సెక్షన్ ఆటవీ సెక్షన్ అధికారి నూకరాజు, గార్డు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండ:గొలుగొండ మండలంలో టేకు పట్టా పర్మిట్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదని నర్సీపట్నం డిఎఫ్‌ఒ బి.రాజారావు పేర్కొన్నారు. పట్టా కర్రల తరలింపులో ఆవకతవకలు జరిగాయంటూ ఈ ప్రాంతం నుంచి అందిన ఫిర్యాదుల మేరకు శనివారం స్థానిక విలేకరుల సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డిఎఫ్‌ఒ మాట్లాడుతూ, మండలంలో పలుచోట్ల కలప వ్యాపారులు టేకు చెట్ల తరలింపునకు చేసుకున్న దరఖాస్తు మేరకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పట్టా రైతులు నరికిన కర్రలను వాటి మొదలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ మేరకు తాము ఇచ్చిన అనుమతులు మేరకే పట్టాదారులు టేకు చెట్లను నరికారని ఆయనన్నారు. తమ అనుమతితో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన టేకు కర్రలను కొలతలు సరిగా ఉన్నది లేనిది పరిశీలించామన్నారు. తాము అనుమతులు ఇచ్చిన చోట చెట్లను నరికారా లేదా అనేది కూడా పరిశీలించామన్నారు. ఈ మేరకు ఇక్కడ ఎటువంటి అవకతవకులు జరగలేదని నిర్ధారణ అయ్యిందని డిఎఫ్‌ఓ రాజారావు తెలిపారు. డిఎఫ్‌ఓ వెంట రేంజర్ వెంకటరావు డిఆర్‌ఓ రాజేష్ గొలుగొండ సెక్షన్ అధికారి లక్ష్మణ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.