May 31,2023 23:51

వాహనాల్లో తరలిస్తున్న ఇసుక వాహనాల్లో తరలిస్తున్న ఇసుక


ప్రజాశక్తి -హుకుంపేట: మండలంలో గెడ్డలు గుళ్ళ బారుతున్నాయి. కొందరు అక్రమ మార్కులు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేసి లాభాలు గడిస్తున్నారు. మండలంలోని తీగలవలస పంచాయతీ మగంబంద, పామురాయీ, కామయ్యపేట గ్రామాలకు సమీపంలో గెడ్డల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ మూడు గెడ్డల నుంచి అధికంగా పాడేరు, హుకుంపేటలకు తరలిస్తున్నారు. లారీ ఇసుక ధర హుకుంపేట సమీప ప్రాంతాల్లో రూ.6500 కాగా పాడేరు, ఇతర ప్రాంతాల్లో రూ. 12 వేల వరకు అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. మారుమూల పట్టాం, బూర్జ, గత్తుం, జార్ర కొండ, మెరకచింత, గన్నేరు పుట్టు, అండిభ, దుర్గం బంధలు తదితర పంచాయతీల ప్రాంతాల్లో ఒక లోడు లారీ 12000 వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ట్రాక్టర్‌ ఇసుక ధర 4500 నుంచి 5వేల వరకు అమ్మకాలు చేపడుతున్నారు. రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడంతో ఇష్టా రాజ్యాంగ సాగుతుంది. వ్యాన్లు, ట్రాక్టర్లు, లారీలు ఏకంగా గెడ్డలకు వెళ్లి ఇసుకను లోడ్‌ చేసుకుని దర్జాగా తిరుగుతున్నాయి. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దిగుడుపుట్టు, రాళ్లగడ్డ, పెద్దగరువు వంతెన వద్ద రోజుకు సుమారు 40 వాహనాల్లో రవాణా జరుగుతోంది.
ఇదిలా ఉండగా మండలంలోని తీగల పంచాయతిలోనే కామయ్యపేట, మంగబంద, పామురాయి సమీప గెడ్డలలో అత్యధికంగా ఇసుకకు డిమాండు ఉంది. మంచి ఇసుక దొరుకుతుండడంతో. పాడేరు, హుకుంపేట పరిసర ప్రాంతాల వాహనాలు అధికంగా వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. రోజుకు 100కు పైచిలుకు లోడ్లు ఇసుక తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. లోడ్‌ వాహనాలు వేగంగా నడుపుతుండడంతో ఊరు పక్కనున్న పిల్లలు ఇటు అటు తిరిగేందుకు భయపడుతున్నారు.
మరోపక్క వంతెన వద్ద ఇష్టానుసారంగా ఇసుకను తవ్వడంతో బ్రిడ్జిలు దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే బీటలు వారిన ఘటనలు ఉన్నాయి.

టోకెన్లు తీసుకోవాలి
పంచాయతీ కార్యదర్శి సాగర్‌, విఆర్వో నూకరత్నంలను వివరణ కోరగా పంచాయతీలో ఎటువంటి రుసుములు చెల్లించకుండానే ఇసుకను తరలిస్తున్నారు. తమకు ఎటువంటి సమాచారం లేదని వారు తెలిపారు. పంచాయతీ పరిధిలోటోకెన్లు తేసుకోవలసి ఉందని వారు అన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాలని, రాత్రి పగలు తరలిస్తుండగంతో గెడ్డలు లోతుకి వెళ్ళి పోతుందని గ్రామ ప్రజలు తెలిపారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకి ఇసుకను తీయడంతో వంతెనలు, రహదారులు ప్రమాదాల బారిన పడుతున్నాయని తెలిపారు.