Feb 18,2023 18:06

మట్టి గుంతలను చూపిస్తున్న కౌలు రైతు సంఘం నాయకులు

అక్రమంగా ఎర్రమట్టి తరలింపు
చూసిచూడనట్టుగా అధికారులు
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
- కౌలు రైతు సంఘం డిమాండ్‌
మట్టి గుంతలను చూపిస్తున్న కౌలు రైతు సంఘం నాయకులు
ప్రజాశక్తి - పాములపాడు

మండలంలోని భానుముక్కల గ్రామంలో వెలుగోడు రిజర్వాయర్‌ కొరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగు గంగ కిందిస్థాయి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంలో అంతర్యం ఏమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శనివారం ఒక రోడ్డుకు అక్రమంగా మట్టిని తరలిస్తుండగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్‌, రైతు నాయకులు కృష్ణ మోహన్‌ తెలుగు గంగ భూముల దగ్గరికి వెళ్లగా అప్పటికే జెసిబి, ట్రాక్టర్లు తీసుకొని పరారైన పరిస్థితి నెలకొంది. వారు అక్రమంగా మట్టిని తీసుకెళ్లిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 1985లో తెలుగు గంగ నిర్మాణాన్ని చేపట్టారని, రిజర్వాయర్‌ నిర్మించేందుకు భానుముక్కల, కొత్త రామాపురం గ్రామ రైతులు నుండి దాదాపుగా 180 ఎకరాలు మట్టికి ప్రభుత్వం తక్కువ ధరకు కొనుగోలు చేసిందన్నారు. ఈ భవిష్యత్తులో రిజర్వాయర్‌కు మట్టి అవసరమైతే మరమ్మతుల కొరకు మిగిలిన భూమిని ఉంచారన్నారు. ఈ భూమిలో కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో కొంతమంది వ్యక్తులు మట్టిని అమ్ముకుంటున్నార న్నారని పేర్కొన్నారు. రైతులు ఆనాడు తక్కువ ధరకే అమ్మారు నేడు భానుముక్కల పొలిమేరకు సిద్దాపురం చెరువు ద్వారా సాగునీరు అందడంతో ఈ ప్రాంతమంతా పంటలు పండుతున్నాయన్నారు. ఆనాడు రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చి జీవనోపాధి కోల్పోయారని, నేడు రైతులకు లక్షలు పెట్టిన ఆ భూమి వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు పరిహారం చాలదని కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లారని, మరో ప్రక్క రిజర్వాయర్‌కి మరమ్మతుల కోసం ఉంచిన భూములలో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా మట్టిని తరలించే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.