ప్రజాశక్తి - దేవరాపల్లి
మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలు గాలికొదిలేసి జిఓ 7,15ను పక్కన పెట్టి యథేచ్ఛగా అక్రమంగా చేపలు చెరువులు నిర్వహణపై సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న బుధవారం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావుకు వినతిపత్రం అందజేశారు. దేవరాపల్లి మండలంలో మామిడిపల్లి, ఎం.అలమండ, కొత్తపెంట తారువ, చేనులపాలెం, పెదనందిపల్లి, కలిగొట్ల, బోయిల కింతాడ, తిమిరాం, మారేపల్లి, దేవరాపల్లి తదితర ప్రాంతాల్లో అక్రమ చేపల చెరువులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజకీయ నాయకుల సహకారం ఉండడంతోనే సుమారు వెయ్యి ఎకరాల వరకు పంట భూములు చేపలు చెరువులుగా మారిపోయాయని పేర్కొన్నారు. దేవుని మాన్యం, అసైన్డ్ భూములు సైతం వదిలి పెట్టడం లేదన్నారు. ప్రజలకు, పర్యావరణానికి నష్టం కల్గించే పశుమాంసం, చికెన్ వ్యర్థాలతో ఈ చెరువుల్లో చేపల పెంపకం చేపడుతున్నారని తెలిపారు. వెంటనే అక్రమ చేపలు చెరువుల యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, అనుమతుల్లేని చెరువులను వెంటనే మూసి వేయాలని కోరారు.
దీనికి స్పందించిన మత్స్యశాఖ జెడి మండలంలోని ఏ ఒక్క చెరువుకు అనుమతులు లేవని, కొంతమంది దరఖాస్తులు పెట్టారని, ఈ ప్రాంతం తెల్లచేపలు పెంపకం చేపడితేనే అనుమతులిస్తామని తెల్చిచెప్పామని పేర్కొన్నారు. అయినా వారికి నచ్చిన చేపలను పెంచుతూ, అనుమతులు లేకుండా చెరువులు తవ్వేస్తున్నారని, వీటిల్లో వ్యర్థ పదార్థాలు వాడుతున్నట్లు గతంలో తమ దృష్టికి వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు పెట్టామని తెలిపారు. అయినా వారి తీరు మారలేదని, త్వరలోనే దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జెడి హామీ ఇచ్చినట్లు వెంకన్న తెలిపారు.










