ప్రజాశక్తి- దేవరాపల్లి
మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా చేపలు చెరువులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేశారు. అనుమతుల్లేని చెరువులను వెంటనే మూసి వేయాలన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో చేపల చెరువులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ జిఒ 7-15ను ఉల్లంఘించి యథేచ్ఛగా పశుమాంసం, చికెన్ వ్యర్థాలతో చెరువుల్లో చేపలు పెంపకం చేస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు రావడంతో వ్యర్థాలు కనబడకుండా తగలబెడుతున్నారని తెలిపారు. ఆహార పంటలు పండే భూముల్లో చేపల చెరువులు తవ్వకూడదన్న ప్రాథమిక నిబంధనలు పాటించకపోయినా అధికారయంత్రాంగం చేతి వాటానికి అలవాటుపడి నోరుమెదపడం లేదని విమర్శించారు. పంట పొలాల మధ్య ఈ చెరువులేంటని రైతులు గగ్గోలు పెడుతున్నా స్పందించే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అండ, అధికారుల సహకారం ఉండడంతో మండలంలో దాదాపుగా వెయ్యి ఎకారాలు వరకు పంట భూములు చేపలు చెరువులుగా మారిపోయాయని తెలిపారు. దేవరాపల్లి మండలంలో ఎం.అలమండ, కొత్తపెంట తారువ, చేనులపాలెం, పెదనందిపల్లి, కలిగొట్ల, బోయిల కింతాడ, మారేపల్లి, దేవరాపల్లి తదితర గ్రామాల్లో ఈ అక్రమ వ్యాపారం సాగుతుందని పేర్కొన్నారు.










