Sep 05,2022 23:39

ఆక్రమిత స్థలాల్లో అధికారులకు సూచనలిస్తున్న జెడ్‌సి కృష్ణ

అధికారులను ఆదేశించిన జెడ్‌సి కృష్ణ
ప్రజాశక్తి- ములగాడ :
60వ వార్డు ఆశోక్‌నగర్‌లో చెత్తాచెదారంతో దుర్గంధంతో ఉన్న ప్రభుత్వస్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జివింఎసి ఐదో జోన్‌ కమిషనర్‌ ఆర్‌జివి.కృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కార్పొరేటర్‌, జివిఎంసి స్టాండింగ్‌ సభ్యులు డాక్టర్‌ పివి.సురేష్‌తో కలసి వార్డులో విస్తృతంగా పర్యటించారు. అశోక్‌నగర్‌లో అధికార పార్టీకి చెందిన నాయకుడు తన ఇంటికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గుర్రపుశాల, స్విమ్మింగ్‌ పూల్‌లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో అపారిశుధ్యం నెలకొని తమను ఇబ్బందులకు గురిచేస్తోందని గున్నా అప్పలరాజు అనే వ్యక్తితోపాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడున్న అధ్వానపరిస్థితులపై విస్తుపోయారు. వెంటనే సంబంధిత ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టాలని సూచించారు.
తమ వాహనాల పార్కింగ్‌ను, అక్కడ నిర్మిస్తున్న గోడను అడ్డుకోవడమే కాకుండా ఆస్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది చూస్తున్నారని గౌరీదేవి ఆలయం వీధిలో పర్యటన సందర్భంగా వందమందికి పైగా కొండవాలు ప్రాంతం మహిళలు జెడ్‌సి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జెడ్‌సి, వెంటనే అసంపూర్తిగా ఉన్న గోడను పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పర్యటనలో సీజనల్‌ వ్యాధులు, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వాటర్‌ వర్క్స్‌ ఎఇ కనకరాజు, వార్డు ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, మలేరియా ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.
మధురవాడ : ఎనిమిదో వార్డు పాత మధురవాడ మెట్ట ప్రాంతంలో జెడ్‌సి బి.రాము గురువారం పర్యటించారు. కాలనీలోని పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు నిర్వహణపై కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వీధిదీపాలు వెలగడం లేదని స్థానిక మహిళలు జెడ్‌సి దృష్టికి తేగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.