ప్రజాశక్తి - ఏలూరు టౌన్
30 ఏళ్లుగా పేదలు, దళితులు సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వాలని, యాజమాన్య హక్కు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో డిఆర్‌ఒ మూర్తికి సంఘం జిల్లా కమిటీ బృందం పి.రామకృష్ణ, ఎం.జీవరత్నం, ఎ.రవి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా పేదలు, దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అసైన్మెంట్ భూముల ఆర్డినెన్స్ వల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని ప్రశ్నించారు. పేదల చేతుల్లో ఉన్న భూములు భూస్వాములకు, అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలకు కట్టబెట్టేెలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని దోసపాడు, పోతునూరు, కొవ్వలి, దెందులూరు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్, సీలింగు, గయాళ భూములు స్థానిక, స్థానికేతర భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం, కేతవరం, గురవాయిగూడెంలో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా సీలింగ్ భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా పంగిడిగూడెం సీలింగ్ భూముల కోసం దళితులు నిరంతర పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మధ్యలో ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములు పేదలకు పంచాలని ఆరున్నరేళ్ల నుండి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. చట్ట వ్యతిరేకంగా ఇరిగేషన్ భూముల్లో విద్యుత్, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై భూస్వాముల బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి భూస్వాములు ఇచ్చే లంచాలు మింగి దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామమ్మగూడెంలో 45 ఏళ్ల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని అమరావతి భూస్వాములకు కట్టబెట్టేలా రెవెన్యూ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కృష్ణాపురం మెట్టలో ఇళ్లు నిర్మించుకుని 15 ఏళ్ల నుండి పేదలు, దళితులు, గిరిజనులు నివాసముంటున్నారని, వారికి విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరారు. పట్టెన్నపాలెం, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఎల్‌టిఆర్ భూములకు సాగు పత్రాలివ్వాలని, వారికి సర్వ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ముసునూరు, చాట్రాయి, లింగపాలెం మండలాల్లో ఉన్న వందలాది ఎకరాల అసైన్డ్, అటవీ భూములను పేదలకు పంచాలని కోరారు. ద్వారకాతిరుమల మండలంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు అసైన్డ్, సీలింగ్ భూములు పేదలకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించుకుని చట్ట వ్యతిరేకంగా సాగుచేస్తున్న మండలస్థాయి రెవెన్యూ శాఖ అధికారులు భూస్వాములిచ్చే లంచాలుమింగి దళిత, గిరిజన పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
దీనిపై డిఆర్‌ఒ మూర్తి స్పందిస్తూ జిల్లాస్థాయిలో పేదలకు న్యాయం చేసే విధంగా చట్టపరమైన విషయాలను అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.సత్యనారాయణ, మడకం సుధారాణి, జిల్లా కమిటీ సభ్యులు నక్క సుబ్బారావు మురళీ, కుమారి, సుబ్బారావు పాల్గొన్నారు.










