Jun 22,2023 23:37

ప్రభుత్వ పాఠశాల స్థలంలో నిర్మితమవుతున్న భవనం

ప్రజాశక్తి - బెల్లంకొండ : పాఠశాల కోసం ఇచ్చిన స్థలాన్ని రాజకీయ అండతో అక్రమార్కులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పైగా ఆ స్థలంలోనే నిర్మాణాన్నీ మొదలు పెట్టడంతో అసలు విషయం తెలిసిన స్థానికులు ఇదేమి దారుణమని ఆవేదనకు గురవుతున్నారు. మండల కేంద్రమైన బెల్లంకొండ పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం ఎస్సీ కాలనీలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉంది. 30-40 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి పాఠశాల లేకపోవడంతో స్థానికులు అర్జీలు పెట్టుకోగా అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే పాఠశాల భవన నిర్మాణానికి స్థలం లేకపోవడంతో పాఠశాల ఏర్పాటే సంశ యంలో పడింది. దీంతో తమ ప్రాంతానికి పాఠశాల రాకుండా పోతుందేమోనని భావించిన స్థానికులు తమ అధీనంలో 10 సెంట్ల గ్రామకంఠాన్ని పాఠశాలకు అందించారు. ఇందులో కొంత స్థలంలో పాఠశాలను నిర్మించగా మిగిలిన స్థలంలో పిల్లలు ఆటలాడుకుంటూ ఉండేవారు. అయితే కొద్దిరోజుల కిందట పాఠశాల ఖాళీ స్థలంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. ఇదేమిటని ఆరా తీస్తే ఆ స్థలాన్ని వారు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆక్రమణలను నిరోధిం చాలని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అంటున్నారు. దీనిపై విఆర్‌ఒ, పంచాయతీ కార్యదర్శి, ఎంఇఒను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు.