ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: వంశధార నదిలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్న అమ్రార్కులను ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెట్టి రైతులను వేధించడం తగదని, కేవలం అధికారి పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలవంచి రైతులపై కేసులు పెట్టారా అని టిడిపి నాయకులు గొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బాధిత రైతులు కుటుంబాలతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. ఈ నిరసనకు గొండు శంకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం నరిదిలోని రొనంకి ఇసుక ర్యాంపును అక్రమంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ తవ్వకాలను నిలుపుదల చేయాలని అడ్డుకునేందుకు వెళ్లిన యువతపై అక్రమ కేసులు బనాయించి స్టేషన్‌లో ఉంచడం తగదన్నారు. అక్రమ ఇసుక ర్యాంపును అడ్డుకునేందుకు వెళ్లిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అదే సమయంలో మహిళలు కూడా రోడ్డుపై బైఠాయించి అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారని అన్నారు. ఇసుక ర్యాంపు వల్ల సమీప గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాల వల్ల భారీ వర్షాల సమయంలో నదిలో నీటి ఉధృతికి సమీప గ్రామాల భూములు కోతకు గురవుతున్నాయన్నారు. దీనివల్ల రైతులు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టంచేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసిపి నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా తీసుకుని తరలిస్తామంటే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వారిలో సింగపురం ఎంపిటిసి పంగ సత్యనారాయణ, వైస్ సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, అధిక సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.










