ఈ కాలమంతా అనేక మంది పెద్దలు ఈ భూమిని దర్జాగా కాజేస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో దేవస్థానం అధికారుల అండతోనే నూతనంగా అనేక వాణిజ్య కట్టడాలు, అపార్ట్‌మెంట్లు వెలుస్తూనే ఉన్నాయి. విశాఖ నగర భూ కుంభకోణాలపై గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వేసిన రెండు సిట్ లకు ఈ భూములపై కూడా అనేక ఫిర్యాదులు అందాయి. అయితే ఈ సిట్ ల రిపోర్టులను ప్రభుత్వం నేటికీ బయట పెట్టలేదు. ఎవరిపైనా ఏ చర్యలూ తీసుకోలేదు.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకం, సింహాచలం భూముల అక్రమాలు వంటి అంశాలు ఇటీవల బాగా వార్తలలోకి వచ్చాయి. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో కోర్టు తీర్పులు కూడా ఇటీవల వచ్చాయి. వాస్తవంగా దీని కంటే ముందు నుండే సింహాచలం భూములకు సంబంధించిన అనేక వివాదాలు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా వివిధ వ్యక్తులు, సంస్థల మధ్య నడుస్తున్నాయి.
గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా 862 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం రికార్డుల నుండి తొలగించారని ఆరోపిస్తూ ఇద్దరు దేవస్థానం అధికారులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సస్పెండు చేసింది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం కనీసం వెయ్యి కోట్ల పైనే ఉంటుంది. అక్రమాలు జరిగితే కేవలం అధికారులపై చర్యలతోనే సరిపెట్టకుండా ఆ భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన న్యాయం జరిగినట్లు.
ఈ సమస్య గురించి తెలుసుకోవాలంటే, మాన్సాస్‌కు సింహాచలం దేవస్థానంకు మధ్య ఉండే సంబంధాన్ని కొద్దిగా అర్ధం చేసుకోవాలి. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో పెద్ద జమీందార్లుగా ఉన్న విజయనగరం రాజులే ఈ రెంటి మధ్య లింక్. జమిందారీ వ్యవస్థను రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం 'ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం-1948' చేసినప్పుడు నాటి రాజ వంశీయులు తమకున్న ఆస్తులను కాపాడుకోవడానికి చట్టంలోని లొసుగులను వినియోగించుకుని మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీని పరిధిలోనే సింహాచలం దేవస్థానంతో సహా 108 దేవాలయాలు వున్నాయి.
సింహాద్రి అప్పన్న ధూపదీప నైవేద్యాలకై ఈ ప్రాంతం లోని 27 గ్రామాల భూముల నుండి వసూలయ్యే శిస్తును విజయనగరం సంస్థానం 18వ శతాబ్దం లోనే కేటాయించింది. ఇవన్నీ ఎస్టేట్ గ్రామాలే. అందువల్ల ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత భూమికి రైతులే ఆటోమేటిక్‌గా హక్కుదారులయ్యారు. అయితే ఇది 22 గ్రామాలలో జరిగినట్లుగా అడివివరం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, వెంకటాపురం అనే ఐదు గ్రామాలలో మాత్రం జరగలేదు. వీటినే పంచగ్రామాలని పిలుస్తారు. అప్పటి నుండీ ఈ గ్రామాల పరిధి లోని భూములపై వివాదం నడుస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోని రెవిన్యూ, ఎండోమెంటు డిపార్ట్‌మెంట్ల మధ్యే జరగడం. దీనిపై ఇరువురి మధ్య రాష్ట్ర హైకోర్టులో కేసులు కూడా నడిచాయి. ఈ పంచ గ్రామాలలో మొత్తం 11,282.26 ఎకరాల భూమి ఉంది. దీనిలో అత్యధికం రెవిన్యూ, పోరంబోకు భూమి కావడంతో ఈ భూమి మాదంటే మాదని రెవిన్యూ, ఎండోమెంటు డిపార్ట్‌మెంట్లు కోర్టుల్లో వాదనలు చేసుకుంటూ వచ్చాయి. వీటిలో రైతుల ఆధీనంలోని భూమిపై ఎటువంటి వివాదమూ ఎక్కడా జరగలేదు.
ఈ భూమంతా విశాఖ నగరానికి అతి సమీపంలోనే ఉండడంతో నగర విస్తరణ ఈ ప్రాంతంలోనే అత్యధికంగా జరిగింది. నేడు ఈ భూమంతా గ్రేటర్ విశాఖ పరిధి లోనే ఉంది. ఈ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని అసెంబ్లీలో చర్చ జరగడంతో ప్రభుత్వం 1996లో ఒక హౌస్ కమిటీని నియమించింది. అయితే ఈ రిపోర్టు గురించి వేచి చూడకుండానే ప్రభుత్వం 1996, 1997లలో 9069.22 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం పేరిట పెందుర్తి, చినగదిలి ఎమ్మార్వోలతో రైత్వారీ పట్టాలిప్పించింది. ఈ భూమికి కూడా ఎటువంటి హద్దులు, సరైన సర్వే నెంబర్లు పేర్కొనలేదు. ఈ పట్టాలు చెల్లవని ఆనాడే సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనరు వాటిని రద్దు చేశారు. అయితే ప్రభుత్వం వాటిని దొడ్డిదారిన పునరుద్ధరించింది. ఈ పట్టాల ఆధారంగా ప్రభుత్వ ఆదేశంతో హైకోర్టులో ఇరు డిపార్ట్‌మెంట్లు రాజీ పిటిషన్ వేసి కేసులు ఉపసంహరించుకున్నాయి.
ఇలా పట్టాలిచ్చిన భూమిలో అప్పటివరకూ రైతుల ఆధీనంలో ఉన్న భూములు కూడా ఉండడంతో ప్రజలకు, సింహాచలం దేవస్థానానికి పెద్ద వివాదం రేగింది. ఈ రైతుల భూములలో అప్పటికే వేసిన లే అవుట్లలో స్థలాలు కొనుక్కుని, వివిధ ప్రభుత్వ సంస్థల నుండి లోన్లు తీసుకుని, మునిసిపాలిటీ అనుమతితో ఇళ్ళు నిర్మించుకున్న సాధారణ ప్రజలందరినీ ఆక్రమణదారులుగా ప్రభుత్వం ముద్ర వేసి, వీరిని మరలా డబ్బులు కట్టి స్థలాన్ని రెగ్యులరైజ్ చేయించుకోమంది. ఇలా అప్పటి వరకు ఏ వివాదంలోనూ లేని వేలాది మంది ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం వివాదంలోకి లాగి, ఇప్పటికీ ఈ సమస్యతో లక్ష మందికి పైగా ప్రజలు ఇబ్బంది పడేలా చేసింది. వాస్తవంగా భూ అక్రమాలకు అవకాశమిచ్చింది ఈ పట్టాలే. ఎలాగంటే రెవిన్యూ భూములయితే పెద్దలు ఆక్రమించుకోవడం కష్టం. అయితే దేవస్థానం భూములయితే, పాలనాధికారి ద్వారా అడ్డగోలు వ్యవహారాలు నడిపించుకోవచ్చు. ఇప్పుడిక్కడ ఇదే జరుగుతోంది.
ఈ కాలమంతా అనేక మంది పెద్దలు ఈ భూమిని దర్జాగా కాజేస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో దేవస్థానం అధికారుల అండతోనే నూతనంగా అనేక వాణిజ్య కట్టడాలు, అపార్ట్‌మెంట్లు వెలుస్తూనే ఉన్నాయి. విశాఖ నగర భూ కుంభకోణాలపై గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వేసిన రెండు సిట్ లకు ఈ భూములపై కూడా అనేక ఫిర్యాదులు అందాయి. అయితే ఈ సిట్ ల రిపోర్టులను ప్రభుత్వం నేటికీ బయట పెట్టలేదు. ఎవరిపైనా ఏ చర్యలూ తీసుకోలేదు. అనేకమంది పెద్దలు, రాజకీయ నాయకులు ఇందులో ఉన్నారని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కేవలం ఒక కేసును పట్టుకుని వదిలేస్తే అది చిత్తశుద్ధి అనిపించుకోదు.
హైకోర్టు ఈ భూ హక్కులపై ఎటువంటి తీర్పు ఇవ్వకుండానే నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏకపక్షంగా సింహాచలం దేవస్థానానికి పట్టాలిప్పించింది అన్నదే అసలు ప్రశ్న. అందులోనూ ఈ భూమి హద్దులు, సరైన సర్వే నెంబర్లు కూడా పేర్కొనకుండా పట్టాలివ్వడంతో ఇక దేవస్థానం పాలనాధికారి ఏది చెపితే అదే సత్యం కింద మారిపోయింది. ఈ లోగా కొత్త సర్వే నెంబర్లు వచ్చాయి. పాత, కొత్త సర్వే నెంబర్ల మధ్య కొరిలేషన్ లేదని స్వయంగా అధికారులే పేర్కొన్నారు. ఇది అనేక అక్రమాలకు అవకాశమిచ్చింది. వాస్తవంగా ఇలాంటివి చేసి, తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వ చర్య ఉపకరించింది. ఈ పట్టాలపై అనేక మంది రైతులు, ప్రజలు, వివిధ కాలనీల సంఘాలు వివిధ కోర్టుల్లో కేసులు వేశాయి. హైకోర్టు ఆదేశానుసారం విశాఖ ఆర్డీఓ కోర్టులో వేసిన కేసులో దేవస్థానానికి ఎమ్మార్వోలు ఇచ్చిన పట్టాలు చెల్లవని 2010లో తీర్పునిచ్చారు. మరో కేసులో హైకోర్టు ఆదేశానుసారమే 2014లో నియమించబడ్డ జిల్లా జాయింట్ కలక్టర్, సర్వే డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్, సిసిఎల్‌ఎ అసిస్టెంట్ సెక్రటరీలతో కూడిన ముగ్గురు సభ్యుల ఉన్నతాధికారుల కమిటీ కూడా ఈ పట్టాలు చెల్లవని తన నివేదికలో పేర్కొంది. అయితే వివిధ ప్రభు త్వాలు మాత్రం దేవుడి భూములంటూ ఈ పట్టాలను రద్దు చేయడం లేదు. దేవుడి భూములని ఏ కోర్టు చెప్పింది? ఏ రెవిన్యూ అధికారి చెప్పారు? అందరూ ఈ పట్టాలు చెల్లవనే కదా చెప్పారు. అయినా ప్రభుత్వం ఎందుకు ఏ చర్యా తీసుకోవడం లేదు? ఎందుకంటే ఇలా ఉంటేనే అక్రమాలకు అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తామని చెప్పే జగన్ ప్రభుత్వం కూడా ఎందుకు చేయలేకపోతోందన్నది కూడా పెద్ద ప్రశ్నే.
ఇటీవల ముఖ్యమంత్రి గారు రాష్ట్ర భూములపై సమగ్ర సర్వే చేయాలని ఆదేశిస్తూ, గత సర్వే వందేళ్ళ క్రితం జరిగిందని తెలిపారు. ఇది ఈ భూముల విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ ప్రాంత భూములపై 1903లో జరిగిన గిల్‌మెన్ సర్వే తప్ప తరువాత ఎన్నడూ సమగ్రమైన సర్వే జరగలేదు. ఆ సర్వే నివేదికలో సింహాచలం దేవస్థానానికి కేవలం 39.19 ఎకరాల భూమి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అందువల్ల మిగిలిన భూమంతా రెవిన్యూ, జిరాయతీ భూములే. ఇప్పటికైనా ప్రభుత్వం తన స్వంత అధికారుల ఆర్డర్లకు అనుగుణంగా అక్రమ పట్టాలను రద్దు చేసి, రెవిన్యూ భూమిని స్వాధీనం చేసుకుని, సరైన హద్దులను గుర్తించడం ద్వారానే విలువైన ఈ భూములను కాపాడుకోవడం సాధ్యం. అలా చేయనంత కాలం ప్రజలకు కష్టాలూ తప్పవు. దేవుడిని అడ్డుపెట్టుకుని జరిపే అడ్డగోలు ఆక్రమణలూ ఆగవు.
/ వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి /
ఎ. అజ శర్మ











