
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నకిలీ ఉత్పత్తులు విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఉమ్మడి జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం ఎస్‌పి కె.ఈశ్వరరావు తెలిపారు. రేషన్ బియ్యం దారిమళ్లీస్తున్న వారిపై నిఘా ఉంచామని, సమాచారం రాగానే వీరిపై దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బయో ఉత్పత్తులు, నకిలీ టీ పొడి విక్రేతలపై ఇటీవల దాడులు చేసి పెద్ద ఎత్తున సరుకు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
జిల్లాలో ఎన్ని బయో ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు?
అనుమతులు లేకుండా బయో ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతూ రైతులను మోసగిస్తున్నారు. రైతులు, డీలర్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ అంశంపై నర్సరావుపేటలో అవగాహన సదస్సు నిర్వహించాం. గత రెండు నెలల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు రూ.7 కోట్ల బయో ఉత్పత్తులను, నకిలీ ఎరువులు, పురుగు మందులను స్వాధీనం చేసుకున్నాం. గుంటూరు కేంద్రంగా నకిలీ బయో ఉత్పత్తుల తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ పరిసరాల్లో కొన్ని కంపెనీలు బయో ఉత్పత్తులకు లైసెన్సులు పొంది అనుబంధ తయారీ కేంద్రాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీరికి అనుమతులు లేవు. ఎక్కడోఒక చోట అనుమతి తీసుకుని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విక్రయాలు చేస్తుంటారు. కాలం చెల్లిన ఉత్పత్తులకు ప్యాకింగ్ మార్పుచేసి తిరిగి కొత్త గడువు తేదీని ముద్రించి పలు దుకాణాల్లో విక్రయిస్తున్నట్టు గుర్తించాం. ఈనెల ఒకటో తేదీన బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరంలో రూ.5 కోట్ల బయో ఉత్పత్తులు, ముడిసరుకు, నకిలీ ఎరువులు స్వాధీనం చేసుకున్నాం. రాజుపాలెం, యాజిలి, కంటెపూడి, గుంటూరు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో మరో రూ.2 కోట్ల విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం.
ఎన్ని ఉత్పత్తులకు అనుమతి ఉంది?
47 రకాల బయో ఉత్పత్తులకు ఆయా రాష్ట్రాల్లో కంపెనీలకు అనుమతి ఇస్తోంది. అయితే వందల సంఖ్యలో ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పల్నాడు, గుంటూరు జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండించడం వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువగా ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని ఈ ప్రాంతంపై బయో ఉత్పత్తుల తయారీ, విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. వీరి మూలాలను కనుగొంటున్నార. ముడిసరుకును కూడా గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నాం.
నకిలీ సిగరెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
వివిధ ప్రాంతాల్లో నకిలీ సిగరెట్లు విక్రయాలు చేస్తుండగా పట్టుకున్నాం. చిలకలూరిపేట, వరగానిలో ఒక వ్యక్తి నకిలీ సిగరెట్ల విక్రయాలు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పట్టుకున్నాం. ఐటిసి బ్రాండ్ పోలిన నకిలీ సిగరెట్స్ అక్రమంగా తయారు చేసిన ఇతర బ్రాండ్ సిగరెట్స్ అమ్ముతున్నట్టు కనుగొన్నాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. మొత్తం రూ.16 లక్షల నకిలీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నాం.
రేషన్‌బియ్యం ఇతర ప్రాంతాలకు తరలింపు?
పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ సరఫరాచేసే వాహనదారులు, డీలర్లు, కొంతమంది అక్రమార్కులు దారిమళ్లీస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ వ్యాపారంపై దృష్టిపెట్టాం. ఇటీవల చెరుకుపల్లి మండలం కనగాల నుంచి గుజరాత్‌కు ఎగుమతి చేస్తున్న వ్యాపారిని పట్టుకున్నాం.
నాణ్యత లేని టీ పొడులు విక్రయాలు?
నాణ్యత లేని టీపొడి విక్రయాలు జరుగుతున్నాయి. సత్తెనపల్లి, నర్సరావుపేటలో ఇటీవల పట్టుకున్నాం. టీపొడి కొనుగోలు కూడా వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి.