ప్రజాశక్తి-చిన్నగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. వ్యవసాయ సాగుకు అనువైన భూములను సైతం అక్రమంగా తవ్వేస్తున్నారు. సాగుభూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని తెలిసినా కూడా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక దిబ్బలను తవ్వకునేందుకు మైనింగ్ శాఖ అనుమతులు ఇస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవసాయ యోగ్యమైన భూముల్లో లోతుగా తవ్వేస్తూ చెరువులను చేస్తున్నారు. రైతు తన సొంత భూమి అని చెబుతున్నప్పటికీ అలా తవ్వితే పక్కనున్న వ్యవసాయ భూములు కూడా సాగుకు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. దీని వల్ల మొత్తం వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంత తెలిసి కూడా అధికారులు పట్టించుకోకపోవడం, అక్రమ తవ్వకం దారులకు పరోక్షంగా సహకరించడం విమర్శలకు కారణమవుతోంది. ఇసుక అక్రమ తవ్వకందారులు తమ స్వార్ధం కోసం ప్రకృతి వనరులను లూటి చేయడాన్ని ప్రజాసంఘాల ఐక్య వేదిక నాయకులు అడ్డుకున్నారు. చిన్నగంజాం పరిధిలోని సర్వే నెంబరు 128, 129, 828, 829, 830, 831లలో సిపిఎం ఆధ్వర్యంలో పేదలకు భూముల పంచాలని 1990లో భూ పోరాటం చేశారు. దీంతో అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్, మండల స్థాయి అధికారులు ఆయా సర్వే నెంబర్లలోని భూములను పరిశీలించారు. మండలంలోని యానాదులకు ఎస్‌టి జాబితా కింద ఆ భూములను సాగుచేసుకునేందుకు తాత్కాలిక పట్టాలను మంజూరు చేశారు. వీటిని మండల రికార్డులలో కూడా నమోదు చేశారు. కొంతమంది ఇసుక అక్రమార్కులు ఆ భూములను కాజేసే దురుద్దేశంతో దొంగ పట్టాలను సృష్టించారు. అధికారులను, పోలీసులను చివరికి కోర్టును కూడా తప్పు దారి పట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మాగాణి రైతులను సైతం భయబ్రాంతులకు గురి చేసి ఆ భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ ప్రకృతి వనరులను సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గతంలో బాధితులు ధర్నాలు, నిరసనలు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదు. అధికారులు జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సిపిఎం నాయకులు జి ప్రతాప్ అధికారులకు స్పందన కార్యక్రమంలో సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో ఐక్యవేదిక నాయకులు జి ప్రతాప్ కుమార్, కడవకుదురు ఎంపీటీసీ ఆమంచి సుబ్బారావు, చిన్నగంజాం ఎంపీటీసీ సుబ్బారెడ్డి, ఎస్‌సి సెల్ అధ్యక్షులు పాదర్తి ప్రకాష్ సారథ్యంలో సోపిరాల గ్రామ రైతులతో కలిసి సర్వే నెంబర్ 828లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను, ప్రొక్లైన్‌ను, ఒక బొలేరో వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ పార్వతి, ఎస్‌ఐ సురేష్ ఇతర అధికారులు స్పందించారు. నేరుగా సంఘటన స్థలానికి వచ్చారు. పరిస్థితిని సమీక్షించారు. సదరు భూములను పరిశీలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అధికారుల సమక్షంలోనే ఆందోళనకారులు ఇసుకను తరలించే మార్గాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుని వ్యవసాయ యోగ్యమైన భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిలో అంబేద్కర్ నగర్‌కు చెందిన మహిళలు, పాదర్తి దానియేలు, ప్రసాద్, చిన్నగంజాం మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, వెంకటేష్, శ్రీనివాసరెడ్డి, సుభాని, ముస్లిం మైనారిటీ యువకులు పాల్గొన్నారు.
జేపీ కంపెనీ వాహనాలు: ఎస్‌ఐ కె సురేష్
అనుమతులు లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్న వాహనాలు, వ్యక్తులు జెపి కంపెనీకి చెందినవని తెలిసి వదిలేశామని చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్ చెప్పారు. అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ తవ్వకాలను ఆపేశామని తెలిపారు.










