Nov 10,2023 23:10

కలెక్టర్‌కు జనసేన, టిడిపి నాయకుల ఫిర్యాదు
ప్రజాశక్తి-అమలాపురం/మండపేట
పేదల ఇళ్ల పేరుతో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు, తరలింపులు చేపడుతున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని మండపేట ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగశ్వరరావు, టిడిపి అమలాపురం పార్లమెంటు ఇన్చార్జ్‌ హరీష్‌ బాలయోగి, జనసేన నాయకులు వేగుళ్ల లీలాకష్ణ తదితరులు డిమాండ్‌ చేశారు. ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న పేదలకు మేలు జరిగేలా చూడాలని కోరారు. మండపేట మండలంలో వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంపై జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను శుక్రవారం కలిసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేశవరం గ్రామంలోని కుర్రవాని మెట్ట నుంచి జగనన్న ఇళ్ల నిర్మాణాల నిమిత్తం గ్రావెల్‌ తరలింపునకు అధికారులు అనుమతిచ్చారని గుర్తు చేశారు. అయితే ఇదే నెపంతో వైసిపి నాయకులు రోజూ ఇష్టారాజ్యంగా వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాలకు గ్రావెల్‌ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. వెదురుపాక, చెల్లూరు గ్రామాల్లో ఇప్పటి వరకు కేవలం 19 లోడ్లు మాత్రమే గ్రావెల్‌ వేశారని, కానీ క్వారీ నుంచి దాదాపు 18వేల లారీల గ్రావెల్‌ మాయమైందని ఆధారాలతో సహా చూపారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), మెట్ల రమణబాబు, బండారు శ్రీనివాస్‌, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.