Aug 09,2023 22:24

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

* ఎస్‌పి జి.ఆర్‌ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
గంజాయి, గుట్కా, నాటుసారా, అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అడ్డుకట్ట వేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర సరిహద్దుల చెక్‌పోస్టుల ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, గుట్కా, ఖైనీ, మద్యం రవాణా కాకుండా చూడాలన్నారు. పక్కా ప్రణాళికను రూపొందించుకుని ఎప్పటికప్పుడు ఆకస్మిక దాడులు నిర్వహించాలని తెలిపారు. నాటుసారా తయారీ, ఉత్పత్తి, విక్రయ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కార్డాన్‌ సెర్చ్‌ చేపట్టి ఆయా గ్రామాల్లో నాటుసారా తయారీ ముడి పదార్థాలను నిర్వీర్యం చేయాలని చెప్పారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జెడి ఎం.ఎన్‌ మణికంఠ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ రవాణాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, ఇసుక, నాటుసారా, మద్యం పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ సిబ్బందికి ఎస్‌ఇబి కమిషనర్‌ రవిప్రకాష్‌ పంపించిన ప్రశంసాపత్రాలను ఎస్‌పి అందజేసి అభినందనలు తెలిపారు.
మిస్సింగ్‌ కేసుల్లో పురోగతి సాదించాలి
మిస్సింగ్‌ కేసులను సమగ్ర దర్యాప్తుతో పరిష్కరించాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కాశీబుగ్గ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ అధికారులతో నిర్వహించిన నెల వారీ నేర సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రాధాన్యత గల కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. వాహన తనిఖీలను విస్తృతం చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని తెలిపారు. ఇందుకోసం కొన్ని బ్రీత్‌ ఎనలేజర్స్‌ అదనంగా పోలీస్‌స్టేషన్లకు ఇవ్వాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. నేర నివారణకు సబ్‌ డివిజన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నైట్‌ బీట్స్‌ బలోపేతం చేసి, అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నేరాల నివారణ, నేరస్తులను గుర్తించడానికి సిసి కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అన్ని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, బ్యాంకులు వ్యాపార సముదాయాలు, ఆలయాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి, కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వర్‌ రెడ్డి, ఎఒ గోపీనాథ్‌, కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.