ప్రజాశక్తి - వినుకొండ : పట్టణంలోని వెన్నుపూస కాలనీలో చేపట్టిన అక్రమ నిర్మాణ పనులను వెంటనే నిలిపేసి గత 15 ఏళ్లగా అక్కడ నివాసం ఉంటున్న షేక్ రంజాన్‌బికి న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.హనుమంత్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సిపిఎం కాలనీలో మంగళశారం విలేకర్లతో మాట్లాడారు. వెన్నపూస కాలనీలోని సర్వేనెంబర్ 333లో 4.18 ఎకరాల ప్రభుత్వ భూమిని 2005లో భూ పోరాటంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ఆక్రమించి నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇందులో రెండు సెంట్లు స్థలంలో రంజాన్ బి నివాసం ఉంటున్నారని, సర్వేనెంబర్ 329లో 26 ఎకరాలు ఉండగా వైసిపి నాయకుడు విడతల అన్నబాబు రెండు సెంట్లు ఉన్నట్లు టౌన్ సర్వే సర్టిఫికెట్ పుట్టించి, పిడతల వెంకటరత్నంకు మరో రెండు సెంట్లు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు దేవదాసు అండతో దౌర్జన్యం చేసి రంజాన్‌బిని ఆ స్థలం నుండి నెట్టేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమికి నకిలీ సర్టిఫికెట్ పుట్టించి వైసిపి నాయకులు చేస్తున్న దౌర్జన్యంపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వైసిపి నాయకుల ఒత్తిడికి గురై ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వెన్నపూస కాలనీ వాగు పోరంబోకు స్థలానికి సర్వే రిపోర్ట్ ఇచ్చిన సర్వేయర్‌ను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ ఇప్పటికైనా జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాన్ని నిలిపేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.










